ప్రదక్షిణ సమయంలో ఏ మంత్రాలు ఉపయోగిస్తారు? ఎన్నిసార్లు ప్రదక్షిణం చేయాలి?

సాధారణంగా దేాలయంలో ముమ్మార్లు ఆలయ ప్రదక్షిణ చేయాలి. మొక్కుబడుల ప్రకారం 11, 108 మొదలైన సంఖ్యలు ఉంటాయి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకాలను చదువుకోవాలి.
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే!!
పాపోయం పాప కర్మాహం పాపాత్మా పాపసంభవః!
త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల!!
అన్యధాశరణం నాస్తి త్వమేవ శరణం మమ!
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర!!
శక్తి దేవాలయాలకు వెళ్ళినప్పుడు పై శ్లోకాలలో దేవకు బదులుగా దేవి; శరణాగత వత్సలకు బదులుగా శరణాగత వత్సలే; మహేశ్వరకు బదులుగా మహేశ్వరి అని మార్చి చదువుకోవాలి. ఈ శబ్దాలు ఏ శక్తి దేవతకైనా సరిపోతాయి. అలాగే దేవ, మహేశ్వర మొదలైన శబ్దాలు విష్ణువుకైనా, శివునకైనా, ఇతర దైవానికైనా చెప్పవచ్చు.
"శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ "
ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం!
తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం!!
మర్కటేశ మహోత్సాహ సర్వశోకవినాశక!
శత్రున్ సంహర మాంరక్ష శ్రీయమాయుశ్చ దేహిమే!! అని పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. తులసిని నమస్కరించేటప్పుడు, ప్రదక్షిణ చేసేటప్పుడు సంప్రదాయంగా చదివే శ్లోకం ఇది.
యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వ దేవతా!
యదగ్రే సర్వ వేదాంశ్చ తులసీం త్వాం నమామ్యహం!!

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి

శివ పార్వతీ నందనుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. ఆయనజననం లోకరక్షణ కొరకే. లోకోద్ధరణ కోసం పుట్టిన ఆ సుబ్రహ్మణ్య స్వామికి అనేక పేర్లు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి కుమారా స్వామి, దండాయుధ పాణి, షణ్ముఖుడు. తమిళులైతే ఈయనను ఆర్ముగం అనీ, మురుగన్ అనీ అంటారు. తమిళనాట ఉన్న ఒక కథనం ప్రకారం దానవులు లోక కంటకులుగా మారిపోవటంతో శివుడు కోపోద్రిక్తుడయ్యాడు. అప్పదు ఆయన మూడవ నేత్రం నుంచి ఆరు అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. వాటిలో నుంచి ఉద్భవించిన వాడే సుబ్రహ్మణ్య స్వామి. ఈయన అసామాన్య పరాక్రమవంతుడు. దేవా సైన్యాధిపతి. దానవ సంహారి. దక్షిణ భారత దేశంలో ఉన్న ఒక నానుడి ప్రకారం ప్రపంచంలో ఎక్కడెక్కడ కొండ ఉంటుందో అక్కడక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి తప్పని సరిగా ఉంటుంది. వాటిల్లో ముఖ్యమైనవి తమిళనాడులో ఉన్న ఆరు దేవాలయాలు. ఈ ఆరింటినీ కలిపి 'షట్ రణ శిబిరాలు' (six battle camps)అని అంటారు. అవి: 1. పళని 2. పళముదిర్ కోలయ్ 3. స్వామి మలయ్ 4. తిరుత్తణి 5. తిరుపరంకుండ్రం 6. తిరుచెందూర్

ద్వాదశాదిత్యులు - సాంబాదిత్యుడు

ద్వారకయందు శ్రీకృష్ణ భగవానునకు పుత్రులుండిరి. వీరిలో సాంబు అందరికంటే గుణవంతుడు, రూపవంతుడు.
ఒకనాడు దేవర్షి నారదుడు శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థము ద్వారకకు వచ్చెను. వీనిని గాంచిన యాదవ కుమారులందరూ ప్రణామములాచరించి పూజించిరి. కాని సాంబు తన సౌందర్య గర్వముతో మునికి నమస్కరించలేదు. పైగా వాని వేషము చూసి నవ్వెను. ఇది నారదునకు నచ్చలేదు. ఈవిషయమును శ్రీ కృష్ణునకు చెప్పెను.
మరొకమారు నారదుడు ద్వారకకు వచ్చెను. అప్పుడు శ్రీకృష్ణుడు గోపికల మధ్య కూర్చొని యుండెను. అప్పుడు నారదుడు వెలుపల ఆటలాడుచున్న సాంబునితో "వత్సా! శ్రీ కృష్ణ భగవానునకు నేను వచ్చినట్లు చెప్పు"మనెను. సాంబుడు ఇట్లనుకొనెను. "ఒకమారు ప్రణామము చేయలేదని ఇతనికి కోపము కలిగెను. నేడునూ ఇతని మాట విననిచో ఇంకనూ కోపమెక్కువగును. అచట తన తండ్రి ఏకాంతమున మాతృమండల మందుండెను. ఇట్టి సమయమున నేనచటికివెళ్ళుట ఎట్లు? ఏమి చేయుదును? వెళ్ళిన తండ్రికి కోపము, వెళ్ళకున్న మునికి కోపము. ముని కోపమున కన్న తన తండ్రి కోపమే మేలని భావించి అంతఃపురమునకు వెళ్ళి దూరముగా నిలబడి తండ్రికి నమస్కారము చేసి నారదుని ఆగమన వార్త వినిపించెను. సామ్బుని వెనుకనే నారదుడునూ అక్కడికి వచ్చెను.
నారదుడు గోపికల మనోవికారమును గ్రహించి భగవానునితో "సాంబుని అతులనీయ సౌందర్యమునకు మోహితులైన కారణమున వీరిలో చంచలత్వము గలిగే"నని చెప్పెను.
సాంబు తల్లులందరినీ తన తల్లి జాంబవతిని చూచినట్లే చూచెడివాడు. అయిననూ దుర్భాగ్య వశమున శ్రీకృష్ణ భగవానుడు సామ్బుని కుష్ఠురోగిని కమ్మని శపించెను. సాంబుడు శ్రీకృష్ణుని ప్రార్ధించసాగెను. శ్రీ కృష్ణ భగవానుడు తన పుత్రుడు నిర్దోషియని గ్రహించి దైవ వశమున ప్రాప్తించిన ఈ రోగ విముక్తికి సాంబుని కాశీకి వెళ్ళి సూర్యుని ఆరాధించుమని చెప్పెను. సాంబుడు కాశీకి వెళ్ళి సూర్యభగవానుని ఆరాధించ సాగెను. అచట ఒక కుండమేర్పరచుకొనెను.
సూర్యుని ఆశీర్వాదముతో సాంబుడు కుష్ఠురోగ విముక్తుడయ్యెను. సప్తమి, ఆదివారము నాడు సాంబు నిర్మించు కొనిన కుండమందు స్నానమాడి సాంబాదిత్యుని పూజించిన వారు రోగ విముక్తులగుదురు.
మాఘమాస శుక్ల సప్తమి ఆదివారము సూర్యగ్రహణముతో సమానమైన పర్వదినమని చెప్పబడినది. ఆ దినము అరుణోదయ కాలమున సాంబాదిత్యుని పూజించుట విశేషము.
చైత్రమాస సప్తమి ఆదివారము నాడు సాంబాదిత్యునకు వార్షిక యాత్ర జరుగును. ఆ దినము అశోక పుష్పములతో సాంబాదిత్యుని పూజించు వారికి ఎప్పటికినీ శోకము కలుగదు.
సాంబాదిత్యుని మందిరము కాశీలో సూర్యకుండ ముహల్లేయందు కుండ సమీపమున కలదు.

మాఘ పురాణం మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము.

మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము.
మాఘమాసమునందు నదీస్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేథ యాగము చేసిన ఫలము కలుగును. అట్లే ఈ మాఘమాస ఏకాదశీ వ్రతం చేసి ఉపాసం వున్న వారలు వైకుంఠప్రాప్తినొందగలరు. మాఘమాసమందు ఏకాదశీ వ్రతమొనరించి సత్ఫలితము పొందిన దేవతలకథలు వినండి. 
పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీర సాగరమును మధించి అమృతమును గ్రోలవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మంధర పర్వతమును కవ్వముగాను, వాసుకి అను సర్పమును త్రాడుగాను, చేసుకొని క్షీరసాగరాన్ని మధించసాగారు. తలవైపు రాక్షసులు, తోక వైపు దేవతలు ఉండి మధించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుఱ్ఱము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాల సముద్రమును మధించగా లోకభీకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్ని తుల్యమైన హాలాహలము పుట్టినది. ఆ హాలాహల విష జ్వాలలకు సమస్త లోకములూ నాశనమవసాగాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులూ సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటినుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరల దేవ దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారిరువురు తగవులాడుకొన సాగిరి. అంతట శ్రీమహావిష్ణువు మాయామోహిని అవతారమునెత్తి వారి తగవును పరిష్కరింపదలచాడు. 
మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని యైన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయా మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్యరాశి. ఆమె వారిరువురి మధ్యకూ వచ్చి అమృతాన్ని ఇరువురికీ సమానముగా పంచెదను. ఎందుకీ తెగని తగవులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను. మీకిష్టమేనా? అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని రెండు భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మంద భాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింప సాగారు. ఈవిధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది. ఈమోసమునకు రాక్షసులు, దేవతలు గొడవపడ్డారు. శ్రీమహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా రెండు చుక్కలు విధివశాత్తూ నేలరాలాయి. అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరుపోసి పెంచసాగాడు. కొంత కాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్యయైన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారు కోరగా మరల వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలచి తోటలో ప్రవేశించాడు. అంతకు ముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై, వనమంతా జల్లాడు. దేవేంద్రుడు పారజాత పువ్వును త్రెంచుచుండగా అక్షతల ప్రభావం వల్లనో, విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయాడు. ఈవార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడగుటచే అమోఘమైన శక్తిచే అలరార సాగాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాద మొనరించి అమృత తుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికర్హుడగు దేవేంద్రునికి ఇప్పించెను. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటినుండి తులసి శ్రీమహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొన సాగింది. అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును. 
ఫలశ్రుతి: 
సూతమహర్షి శౌనకాది మునులతో మహర్షులారా! వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహాత్మ్యమును, మాఘ స్నాన మహిమను మీకు వివరించితిని. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది. కావున సర్వులూ మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమ నిష్ఠలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణ్వాలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి. మాఘమాసం ముప్పది రోజులూ క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ, ఏకాగ్రతతోనూ, చిత్తశుద్ధితోనూ శ్రీమహావిష్ణువు ను మనసారా పూజించినచో సకలైశ్వర్య ప్రాప్తియూ, పుత్రపౌత్రాభివృద్ధియు, వైకుంఠప్రాప్తి నొందగలరు. 
సర్వే జనాః సుఖినో భవన్తు!!
మాఘపురాణం సంపూర్ణం!!

శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం - ఫాల్గుణ మాసం

శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం - ఫాల్గుణ మాసం. ఫాల్గుణమాసంలో మొదటి పెన్నెండు రోజులు, అంటే శుక్లపక్షపాడ్యమి మొదలు ద్వాదశి వరకూ శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన రోజులు. ప్రతి రోజూ తెల్లవారు ఘామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, శిరస్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన అనంతరం, శ్రీమహావిష్ణువును షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి, పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ పన్నెండురోజుల్లో ఒకరోజుగానీ లేదంటే ద్వాదశి నాడుగానీ వస్త్రాలు, వివిధదాన్యాలను పండితులకు దానముగా ఇవ్వడం మంచిది. శక్తివున్నవారు ఏదైనా వైష్ణవాలయానికి ఆవును దానమివ్వడం విశేష ఫలితాలనిస్తుంది. పూర్ణిమనాడు పరమశివుడిని, శ్రీకృష్ణపరమాత్మను, మహాలక్ష్మినీ పూజించడంతో పాటూ "లింగపురాణం" ను దానముగా ఇవ్వడం మంచిది. అట్లే ఈనాటి సాయంత్రం శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపవలెను. దీనిని డోలోత్సవం అని అంటారు. దీనినే కొన్ని ప్రాంతాలలో డోలాపూర్ణిమ అని అంటారు. నరాడోలాగతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం ఫాల్గున్యాం ప్రయతోభూత్వా గోవిందస్య పురంప్రజేత్‌ ఉయ్యాలలో అర్చింపబడిన పురుషోత్తముడైన గోవిందుని ఈ రోజున దర్శించిన భక్తులకు వైకుంఠప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ రోజున రంగుపొడులను, రంగునీళ్ళను చల్లుకోవాలని చెప్పబడింది. ఈ రోజున ఉదయాన్నే నూనెతో తలంటిస్నానం చేసి 'చూత కుసుమ భక్షణం' తప్పక చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పూజ ప్రకారం, ఇంటిని శుభ్రం చేసి, ఇంటి ప్రాంగణంలో తెల్లనిగుడ్డను ఆసనంగా తూర్పుముఖంగా కూర్చుని, ఒక ముత్తైదువుచే వందన తిలకం, నీరాజనాన్ని పొంది చందనంతో కూడిన మామిడి పువ్వులను తినాలి. చూతమగ్ర్యం వసంతస్య మాకందకుసుమం తద సచందనం పిచామ్యద్య సర్వకామ్యార్థ సిద్దయే అనే శ్లోకంతో మామిడిపూతను స్వీకరించాలి. అనంతరం రంగులను నృత్యగానాదులతో చల్లుకోవాలని చెప్పబడింది. అట్లే, హరిహరసుతుడు అయిన అయ్యప్పస్వామి వారు జన్మించిన దినం కూడా ఈనాడే కనుక వారిని పూజించడం విశేష ఫలితాలనిస్తుంది. ఫాల్గుణమాసంలో పూర్ణిమరోజున హోళీపండుగను నిర్వహిస్తుంటారు. ఈ పూర్ణిమ శక్తితో కూడినది. ఏ సంవత్సరమైనా పూర్ణిమ, ఉత్తరఫల్గుణి కలిసి వస్తే, ఆ రోజున మహాలక్ష్మిని షోడశోపచారాలతో ఆరాధించి, లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారా స్తోత్రాలను పారాయణం చేయడం మంచిది. హోళిరోజూన లక్ష్మీదేవిని ఆరాధిస్తే సమస్త శుభములు కలుగుతాయని పెద్దలవాక్కు. కొన్ని దక్షిణాది ఆలయాలలో ఫాల్గుణపూర్ణిమను చాలా గొప్పగా చేస్తారు. ఈ ఉత్సవం వెనుక ఒక కథ ఉంది. ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్లు చేసింది. శివుని కళ్ళు మూతపడినందు వల్ల జగమంతా అంధకారబంధురమైంది. శివుడు కోపగించు కోవడంతో, అలిగిన పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి, తిరిగి శివుని అభిమానాన్ని పొందేందుకు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించింది. ఒకానొక పాల్గుణపూర్ణిమనాడు మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయశ్చిత్త కర్మకాండను పూర్తిచేసింది. అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహించాడు. అప్పటినుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఫాల్గుణ మాసములో ఈ విధమైన పూజలను, దానాలను చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవచనం.

రామాయణం -- 19

ఆ శివ ధనుస్సుని తెప్పిస్తే మా పిల్లలు ఒకసారి చూస్తారు అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడా ఎనిమిది చక్రాలు కలిగిన మంజూషని లాక్కొని వచ్చారు.
ఒక మనిషి అసలు ఈ ధనుస్సుని పైకి ఎత్తి, వింటినారిని లాగి కట్టడం జెరుగుతుందా, సరే ఏదో అడిగారు కాబట్టి ఆ ధనుస్సుని తీసుకోచ్చాము చూడండి, అని జనకుడు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనుస్సుని ఒకసారి చూడమని రాముడితో చెప్పాడు. అప్పుడు రాముడు ఆ మంజూషని తెరువగా అందులో పాము పడుకున్నట్టు ఆ ధనుస్సు ఉంది. క్షత్రియుడైన రాముడు ఆ ధనుస్సుని చూడగానే చాలా ఉత్సాహపడి, ఈ ధనుస్సు ఎంతో బాగుంది, దీన్ని ముట్టుకుంటాను, తరువాత ఎక్కుపెడతాను అని విశ్వామిత్రుడిని అడిగాడు.
ఆయన అలాగే ఎక్కుపెట్టు అన్నాడు.
ఆరోపయత్ స ధర్మాత్మా స లీలం ఇవ తత్ ధనుః |
ఆరోపయిత్వా మౌర్వీం చ పూరయామాస వీర్యవాన్ |
తత్ బభంజ ధనుర్ మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః ||
రాముడు ఆ ధనుస్సుని ఎంతో తేలికగా, కష్టం లేకుండా పైకి ఎత్తి, నారి కడదామని లాగేసరికి, వంగిన ఆ ధనుస్సు మధ్యలో "ఫడేల్" అని గట్టి శబ్దంతో విరిగిపోయింది. పిడుగులు పడే శబ్దంతో ఆ శివ ధనుస్సు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అక్కడున్న మిగతా వారందరూ మూర్చపోయారు.
భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథ ఆత్మజః |
అతి అద్భుతం అచింత్యం చ అతర్కితం ఇదం మయా ||
అప్పుడు జనకుడు " మహానుభావ విశ్వామిత్రా! నీకు తెలుసు, అందుకే ఈ పిల్లలు ఇద్దరినీ తీసుకొచ్చావు, రాముడు దశరథాత్మజుడు, ఈ సంఘటన అద్భుతం, ఊహించరానిది, ఎవరూ వాదించరానిది. సీతమ్మ మా వంశంలో జన్మించి, తగిన భర్తని పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది " అన్నాడు.
అయితే ముందు కొంతమంది రాయబారులని దశరథ మహారాజుగారి దెగ్గరికి పంపించి, రాముడు శివధనుర్భంగం చేసి సీతమ్మని వీర్య శుల్కగా గెలుచుకున్నాడన్న విషయం చెప్పండని విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు. వెంటనే జనకుడు కొంతమంది పరివారాన్ని అయోధ్యకి పంపగా, వాళ్ళు గుర్రాల మీద అయోధ్యకి చేరుకోవడానికి 3 రోజులు పట్టింది. అక్కడకి చేరుకున్నాక, మేము జనకుడి పలుకున వచ్చామని చెప్పి లోనికి వెళ్ళగా, వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్లు కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళు జెరిగినదంతా చెప్పారు. మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దెగ్గరున్న శివ ధనుస్సుని ఎక్కుపెట్టడమే కాకుండా, శివధనుర్భంగం కూడా చేశాడు. అందువలన ఆయన తన కుమార్తె అయిన సీతమ్మని నీ కుమారుడైన రాముడికిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. మీకు కూడా సమ్మతమైతే, మీ కుమారులను చూసుకోవడానికి మా నగరానికి రావలసిందిగా జనకుడు ఆహ్వానం పంపాడని ఆ రాయబారులు చెప్పారు.
వెంటనే దశరథుడు తన గురువులతొ, పురోహితులతొ సమావేశమై జనకుడి నడువడి ఎటువంటిది అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, " మహానుభావ దశరథ! విదేహ వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు, శరీరం మీద భ్రాంతి లేనివాడు, భగవంతుడిని నమ్మినవాడు, అపారమైన జ్ఞానమున్నవాడు. తప్పకుండా మనం ఆ సంబంధం చేసుకోవచ్చు" అన్నారు.
వెంటనే దశరథుడు మనం ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా రేపే బయలుదేరదామన్నాడు. కోశాధికారులని పిలిచి రత్నాలు, వజ్రాలు, ధనపు మూటలు పట్టుకొని ముందు బయలుదేరండన్నాడు, రథాలని, చతురంగ బలాలని సిద్ధం చెయ్యమన్నాడు, పురోహితులు, మంత్రులు నాతో బయలుదేరండి, అందరం మిథిలా నగరాన్ని చేరుకుందామన్నాడు. మరుసటి రోజున అందరూ బయలుదేరారు. ఇక్ష్వాకువంశంలో ఉన్న ఆచారం ప్రకారం తన 3 పత్నులని దశరథుడు తీసుకెళ్ళలేదు.
దశరథ మహారాజు తన పరివారంతో ఆ మిథిలా నగరాన్ని చేరుకోగానే, జనకుడు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి, మీరు రావడం వల్ల నేను, నా రాజ్యము పవిత్రమయ్యాయి అని లోపలికి రమ్మన్నాడు. నా కూతురైన సీతమ్మని వీర్య శుల్కగా ప్రకటించి, శివ ధనుస్సుని ఎక్కుపెట్టినవాడికి ఇస్తానన్నాను, నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు, అందువలన నా కుమార్తెని నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను, కావున నన్ను అనుగ్రహించి నా కుమార్తెని మీ కోడలిగా స్వీకరించు అన్నాడు.
ప్రతిగ్రహో దాతృ వశః శ్రుతం ఏతత్ మయా పురా |
యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్ కరిష్యామహే వయం ||
అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు " అయ్యయ్యో జనకా, అలా అంటావేంటి, అసలు ఇచ్చేవాడు ఉంటె కదా పుచ్చుకునేవాడు ఉండేది, పదే పదే నీ కోడలిని చేసుకో అని అంటావు. నీ కుమార్తెని నా ఇంటికి కోడలిగా ఇస్తానన్నావు, ఔదార్యం నీది, దాతవి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను" అని అన్నాడు.
ఈ పూటకి ప్రయాణం చేసి అలసిపోయాము, రేపు మాట్లాడుకుందామన్నారు. దశరథుడితో పాటు వచ్చినభరతశత్రుఘ్నులు రామలక్ష్మనులతో కలిసారు. ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి వాళ్ళ నలుగురూ సంతోషంగా మాట్లాడుకున్నారు. దశరథుడితో పాటు వశిష్ఠుడు, కాత్యాయనుడు, జాబాలి,మార్కండేయుడు, కాశ్యపుడు, వామనుడు మొదలైన వాళ్ళు, విశ్వామిత్రుడు, శతానందుడు మరియు మిగిలిన మహర్షులందరూ ఒకచోట చేరారు. ఇంతమంది గొప్పవాళ్ళతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది.

విష్ణు ఆలయములకు వెళితే

విష్ణు ఆలయములకు వెళితే మనకు గొప్పగా కనిపించేది రాజగోపురం దానికి మనం నమస్కరించియే లోపలకు వెళ్ళవలెను

౨ మొదట మనకు కనపడేది బలి పీఠం అక్కడ సాష్టాంగముగా నమస్కరించి మన కామ క్రోధ అత్యాశ అహంకారాదులను బలి చేసి దర్శనమునకు వెళ్ళవలెను

౩ తర్వాత కనపడేది ధ్వజ స్తంభము ఇక్కడే ఉత్సవ వేళలో పతాకం ఎగురవేసి అది అందరికి ఉత్సవం జరుగుతున్నది అని చెప్పడానికి

౪ తర్వాత లక్ష్మి, రాముడు కృష్ణుడు నరసింహుడు ఆంజనేయుడు సుదర్శన చక్రం ఆండాళ్ ఆళ్వార్లు వీరందరినీ మొక్కి తర్వాత మూల స్థాన దర్శనమునకు వెళ్ళవలెను

౫ కోవెల నుండి బయటకు వచ్చేటప్పుడు కొద్ది సేపు కోవెలలో కూర్చొని రావలెను. అప్పడు స్వామీ నేను నా అభీష్టములను నీకు విన్నవిన్చుకొన్నాను నాకు ఏది సరి అని అనిపిస్తోంది దానిని నాకు ఇవ్వమని మనసారా ప్రార్థించ వలెను

౭ మరల ధ్వజస్థంభము వద్దకు వచ్చి ఉత్తర దిశగా తల పెట్టి సాష్టాంగ నమస్కారము చేయవలెను స్త్రీలు పంచాంగ నమస్కారం చేయవలెను .

నాచికేతుడు

ఉద్ధాలకుని కొడుకు ఔద్దాలకి. అతడి కొడుకు నాచికేతుడు. ఒకనాడు ఔద్దాలకి ఏటి రేవులో కుశలు, సమిధలు, కమండలువు, పూలూ అన్నీ మరచిపోయి ఇంటికి వచ్చి వాటిని నాచికేతుడిని తీసుకొని రమ్మని పంపాడు. అతడు ఏటి వద్దకు పోయేసరికి ఏరుపొంగి వాటిని తనలో కలుపుకొన్నది. నాచికేతుడు వాటిని కానక ఇంటికి తిరిగి వచ్చి తండ్రితో ఆ సంగతి చెప్పాడు. ఔద్దాలకి కోపంతో కొడుకును 'యముడి వద్దకు పొమ్ము' (చావుము) అని తిట్టాడు. నాచికేతుడు తండ్రిని క్షమించుమని కోరుతూ ఉండగానే నేలపై పడి ప్రాణాలు కోల్పోయాడు. దానిని గమనించి ఔద్దాలకి పుత్రుడి శవం మీద పడి కన్నీరు మున్నీరుగా దుఃఖించసాగాడు. ఒక పగలు రాత్రి అట్లా గడిచిపోయాయి. తండ్రి కన్నీటితో తడిసిన కొడుకు శవం ఆ తరువాత చైతన్యవంతమైనది. అతడి శరీరం సుగంధయుతమై ఇంపు గోలిపింది. కొడుకు బ్రతికేసరికి తండ్రి ఆహ్లాదంతో అతడిని జరిగిన సంగతి గురించి అడిగాడు. నాచికేతుడు తండ్రికి నమస్కరించి ఇట్లా చెప్పాడు. 'నీ ఆనాటితో నేను అందమైన యముడి పట్టణానికి వెళ్ళి సమున్నత సింహాసనం మీద ఉన్న యమధర్మరాజును దర్శించాను. ఆయన నేను చావలేదనీ, నీ ఆజ్ఞప్రకారం యముడిని దర్శించాననీ, తిరిగి వెళ్ళుమనీ తెలిపాడు. నేను ధర్మమూర్తి అయిన ఆయనను పుణ్యలోకాలను చూపుమని అడిగాను. ఆయన ప్రీతితో ఒక రథం మీద నన్ను ఎక్కించుకొని పుణ్య లోకాలన్నీ దర్శింపజేశాడు. 'ఈ పుణ్యలోకాలు ఎవరికీ లభిస్తాయి? అని నేను అడుగగా 'అవన్నీ గోదానం వలన కలిగే ఫలా'లని పేర్కొన్నాడు. గోవులు అంటే సూర్య కిరణాలు కాబట్టి గోదానం చేసిన వారు సూర్యుడివలె ప్రకాశిస్తారన్నాడు. నన్ను తిరిగి పంపాడు' అని చెప్పి తండ్రికి పరమానందాన్ని కలిగించాడు నాచికేతుడు.

శ్రీరామ మంత్రము (శ్లోకాలు)

1. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం
జనన మరణభేద క్లేశ విచ్చేద మంత్రమ్
సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం
రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రమ్
2. సంసార సాగర భయాపహ విశ్వమంత్రం
సాక్షాన్ముయుక్షు జనసేవిత సిద్ధ మంత్ర్
సారంగహస్తముఖ హస్త నివాస మంత్రం
కైవల్య మంత్రమనిశం భజ రామమంత్రమ్
3. నిఖిల నిగమ మంత్రం నిత్య తత్త్వాఖ్య మంత్రం
భవమలహరమంత్రం భూమిజా ప్రాణ మంత్రమ్
పవనజనుత మంత్రం పార్వతీ మోక్షమంత్రం
పశుపతి నిజమంత్రం పాతు మాం రామమంత్రమ్
4. దశరథ సుతమంత్రం దైత్య సంహారి మంత్రం
విబుధ వినుత మంత్రం విశ్వవిఖ్యాత మంత్రమ్
మునిగణసుత మంత్రం ముక్తి మార్తైక మంత్రం
రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రమ్
5. ప్రణవ నిలయ మంత్రం ప్రాణ నిర్వాణ మంత్రం
ప్రకృతి పురుష మంత్రం బ్రహ్మరుద్రేంద్ర మంత్రమ్
ప్రకట దురిత రాగ ద్వేష నిర్నాశమంత్రం
రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రమ్
6. నిత్యం శ్రీరామ మంత్రం నిరుపమ మధికం నీతి సుజ్ఞానమంత్రం
సత్యం శ్రీరామమంత్రం సదమల హృదయే సర్వదారోగ్య మంత్రమ్
స్తుత్యం శ్రీరామమంత్రం సులలిత సుమన సౌఖ్య సౌభాగ్యమంత్రం
పఠ్యం శ్రీరామమంత్రం పవనజ వరదం పాతు మాం రామమంత్రమ్
7. సకల భువన రత్నం సచ్చిదానంద రత్నం
సకల హృదయ రత్నం సూర్యబింబాంత రత్నమ్
విమల సుకృత రత్నం వేద వేదాంత రత్నం
పురహర జపరత్నం పాతు మాం రామరత్నమ్
8. నిగమ్ శిశిర రత్నం నిర్మలానంద రత్నం
నిరుపమ గుణరత్నం నాదనాదన్తు రత్నమ్
దశరథ కుల రత్నం ద్వాదశాంతస్థ రత్నం
పశుపతి జప రత్నం పాతు మాం రామరత్నమ్

పిల్లలను దృష్టిదోషాలనుంచి కాపాడే శ్లోకం

వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః I
రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం II
కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభమర్దన I
ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః II
మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన I
యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి II
బాలగ్రహాన్ విశేషేణ ఛింది ఛింది మహాభయాన్ I
త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం II

ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం

సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకలావతంసం భక్తీ ప్రదానాయ కృపావతీర్థం టం సోమనాథం శరణం ప్రపద్యే శ్రీశైల శృంగే విబూధాతింసంగే తులాద్రితుంగే పి ముదావసంతం త మర్దునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం అవంతికాయం విహాతావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యో: పరిరక్షణానార్థం వందే మహాకాల మహాసురేశం కావెరికా నర్మదాయో: పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాతృపరే వసంతమోంకార మీశం శివమేకమీడే పూర్వోత్తరే ప్రజ్ఞ్వలైకా నిదానే సదా వసంతం గిరిజాసమేతం సురాసురాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం టం మహం నమామి యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషి తాంగం వివిధైశ్చభోగై: సద్భక్తిముక్తి ప్రదమీశ మేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే మహాద్రిపార్శ్వే చ తటేరమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రై: సురాసురైర్యక్ష మహోరగాద్వై: కేదారమీశం శివమేకమీడే సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్ర దేశే యద్దర్శనా త్పాటకమశునాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే సుతాష్రపర్ణీ జలరాశియోగే నిబధ్యసేతుం విషఖై రాసంఖ్యై: శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి యం ఢాకినీ శాకినికా సమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ సదైవ భీమాది పడ ప్రసిద్ధం తం శంకరం భక్తిహితం నమామి పానంద మానంద వనే వసంత మాననందకందం హతపాపబృందం వారాణసీనాథ మనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ఇలాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం వందే మహోదారతర స్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే జ్యోతిర్మయ ద్వాదశాలింగకానం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ స్తోత్రం పఠిత్వామనుజోతి భక్త్యాఫ్లం తదాలోక్య నిజం భాజేచ్ఛ
జ్యోతిస్వరూపుడైన మహేశుడు ఈ పవిత్ర భారతావనిలో పన్నెండుచోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. భారతదేశంలోని నాలుగుదిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలున్నాయి .సముద్రపు ఒడ్డున రెండు (బంగాళాఖాత తీరంలో రామేశ్వరలింగం, అరేబియా సముద్రతీరాన సోమనాథలింగం) పర్వత శిఖరాలలో నాలుగు (శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, మేరుపర్వతాలపై వైద్యనాథలింగం) మైదాన ప్రదేశాలలో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగాబాద్ వద్ద ఘృష్ణేశ్వర లింగం, ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం) నదుల ఒడ్డున మూడు (గోదావరీతీరాన త్రయంబకేశ్వర లింగం, నర్మదాతీరానా ఓంకారేశ్వరుడు, గంగానదీతీరాన విశ్వేశ్వరుడు), ఇలా మొత్తం పెన్నెండు జ్యోతిర్లింగ రూపాలలోనున్న ఈ లింగాలు పరమశివుని తేజస్సులు. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. పదమూడవ లింగం కాలలింగం. తురీయావస్థను పొందిన జీవుటే కాలలింగము. తైత్తీరీయోపనిషత్తుననుసరించి 1 బ్రహ్మ, 2 మాయ, 3 జీవుడు, 4 మనస్సు, 5 బుద్ధి, 6 చిత్తము, 7 అహంకారము, 8 పృథ్వి, 9 జలము, 10 తేజస్సు, 11 వాయువు, 12 ఆకాశం ... ఈ పన్నెండు తత్త్వాలే పన్నెండు జ్యోతిర్లింగాలు. ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి. ఖాట్మండులోని పశుపతినాథ లింగం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది. ఈ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ వుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినా, స్పృశించినా అనేక మహిమలు మన జీవితాలలో ప్రస్ఫుటమవుతుంటాయి. పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేని వారు, కనీసం ఒక్క లింగాన్నైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దల వాక్కు.

నంది దర్శనం

నందీశ్వరుని ప్రార్థించిన తర్వాతే శివ దర్శనానికి వేళ్ళాలి. నందీశ్వరుని అనుమతి లేనిదే శివపూజ చేయకూడదు. అలా చేస్తే ఫలితం శూన్యం.
"నందీశ్వర సమస్తుభ్యం శాంతా నంద ప్రదాయకం!
మహాదేవసేవార్థం అనుజ్ఞాందాతుమర్హసి’’

అని ప్రార్థించి ఆయన కొమ్ముల మధ్యనుండి శివలింగాన్ని చూస్తూ ‘‘ఓంహర, ఓంహర’’ అంటూ ప్రార్థిస్తే ఏడుకోట్ల మహామంత్రాలను జపించిన ఫలాన్ని పొందుతారు. యువతులు అపసవ్యంగా, బ్రహ్మచారులు సవ్యంగాను, గృహస్థులు సవ్యాపసవ్యములుగాను శివప్రదక్షిణం, ‘‘చండీ’’ ప్రదక్షిణం చేయాలి. శివునికి ప్రదక్షిణం చేసేటప్పుడు సోమసూత్రం దాటరాదు. చండి ప్రదక్షిణం ఒకసారి చేస్తే 30 వేల సార్లు ప్రదక్షణ చేసిన ఫలితం వస్తుంది

భస్మధారణలోని అంతరార్థం

ఎంతో నిగూఢత్వం నిండివున్న భస్మా న్ని మరే ఇతర దేవుడుగాక పరమశివుడే ధరించడంలో అంతరార్థం ఏమిటో, మరే ఇతర దైవాలు ఎందుక భస్మాన్ని ధరించరో, శంకరుడే ధరించడానకి గల కారణం ఏమిటో చెప్పే కథ ఒకటుంది. మహర్షి ఆశ్రమానికి సద్బ్రాహ్మణుడి వేషంలో తరలి వచ్చాడు పార్వతీశుడు. సాటి బ్రహ్మణుడిని చూడగానే ఘనంగా స్వాగతం పలికి అతిథిమర్యాదలు చేసాడు మహర్షి. మర్యాదలన్నీ పొందిన తరువాత బ్రహ్మణ వేషధారియైన గంగేశుడు మహర్షిని ఉద్దేశించి ‘‘మహర్షి ! అతిథి సత్కారాలు సంపూర్ణంగా తెలిసిన నీకు విజయోస్తు ! నీవంటి జ్ఞానసంపన్నుడు, తపోధీరుడు సుఖదు:ఖాలకు అతీతుడైన ఉండాలి. సంతోషాలను ఆవేకావేశాలను అదుపులో ఉంచుకోవాలి. కానీ నువ్వు ఏ విషయాన్నో పదేపదే స్మరించుకుంటూ మహా సంబరపడుతున్నావు. నీ అంతటి అమిత తపోధీరుడిని సైతం మాయ చేసి ఇంతగా సంతోషపెట్టి ఉబ్బితబ్బిబ్బు చేస్తున్న సంగతి ఏమిటో నేను తెలుసుకోవచ్చునా?’’ అని అడిగాడు.
అంతవరకు తనలోనే దాచుకున్న సంతోషాన్ని పంచుకునేందుకు ఒకరు వచ్చినందుకు మహర్షి ఎంతగానో సంబరపడుతూ ‘‘ఓ సాధుపుంగవా! నా అమితానందానికి కారణం నువ్వు తెలుసుకుంటే ఎంతటి తప: స్సంపన్నుడైనా దైవాంశ సంఘటనలకు సంతోష పడడం సహజమేనని తెలుసుకుంటావు. నా చేతి వ్రేలు గాయపడినపుడు గాయం నుండి రక్తానికి బదులు, పరిమళభరిత ద్రావకం వెలువడుతోంది. అంటే నా తపస్సుకు పరంథాముడు అంగీకరించినట్లే కదా! ఇంతకంటే ఆనందకారకం ఏం కావాలి’’ అంటూ వివరించాడు.
పరమశివుడు మహర్షి అజ్ఞానానికి నవ్వుతూ ‘‘మహర్షీ ! నీ అ మాయకత్వానికి ఎంతో దిగులుగా ఉంది. ఈ శరీరం, సకల జీవరాశులు, సమస్త ప్రకృతి, ఈ అనంతవిశ్వమంతా ఏదో ఒక సమయంలో లయం కావలసినవే. అలా లయమైనపుడు సహజ ధర్మాలకు ఆధారమైన ఆకృతి కాలి మసి కావలసిందే. అలాంటి సంపూర్ణ లయత్వంలో సృష్టిలో మిగిలేది బూడిదే. శాశ్వతమైన బూడిదను పొందడమే అద్భుతమైనది. నా వ్రేలి నుండి అటువంటి శాశ్వతానందం నీవు చూడగలవు’’ అంటూ తన వ్రేలిని సున్నితంగా గాయపరచుకున్నాడు. ఆ వెంటనే స్వామి వ్రేలి నుండి బూడిద రాలసాగింది. వచ్చినది ఈశ్వరుడని గ్రహించి ‘స్వామీ ! నా అజ్ఞానం తెలియవచ్చింది. ఎంతో అద్భుతాన్ని నాకు చూపించి, నా అజ్ఞానం పొగొట్టిన నీవు ఎవరో నీ దివ్యరూపమేటో నాకు చూపి నన్ను ధన్యుడిని, పునీతుడిని గావించు’’ అని మహర్షి వేడుకున్నాడు. విశ్వనాథుడు తన అమిత మహోన్నత సుందర దివ్య నమ్మోహన రూపంతో దర్శనమిచ్చాడు.

శివరాత్రినాడు చేయవలసిన విధులు

1. ఉపవాసం - భక్తి లేకుండా నిరాహారంగా రోజు గడిపివేస్తే అది ఉపవాసం కాదు. జీవాత్మను పరమాత్మ సన్నిధిలోకి తీసుకుని వెళ్ళాలి. అంటే, మన మనస్సు, మాట, చేష్టలు ఆ పరమశివుని కోసమే ఉండాలి. మనస్సులో మరో భావనకు చోటులేకుండా, జీవాత్మ పరమాత్మల ఐక్యవాసమే ఉపవాసం.

2. జాగరణం - బాహ్యంగా పరమశివుడు మహావిషాన్ని సేవించిన రోజు శివరాత్రి. విషం మ్రింగి నిదురపోతే శరీరమంతా త్వరగా వ్యాపించి, సమస్త భువన మండలాలకు వ్యాపిచి, ప్రళయం సంభవిస్తుంది. అందువలన భక్తులందరు శివస్తుతులతో ఆ పరమ శివుణ్ణి మేలుకొనేటట్లుగా చేసిన, సమస్త లోకాలకు మేలు చేకూరుతుంది. అంతర్గతంగా శివభక్తి సాధనలో మోక్షాన్ని సాధించాలంటే మనో-బుద్ధి-అహంకార-చిత్తములనే అంతఃకరణల్ని శివభావాత్మకాలుగా జాగృతం చేసి, జీవ చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో ఐక్యం చెయ్యాలి. అంటే, కామ-క్రోధాది అరిషడ్వర్గ బంధనాలనుంచి 'జీవాహంత'ను విడిపించి, 'విశ్వ అహంత' అయిన శివతత్వంలోనికి ఐక్యం చెయ్యటమే జాగరణ.

3. అభిషేకం - పరమేశ్వర జ్యోతిర్లింగం అర్ధరాత్రి సమయంలో సంభవించిందని పురాణాలు చెబుతున్నవి. అందుచేతనే అర్ధరాత్రి సమయంలో అభిషేకవిధిని నిర్వహిస్తారు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు.
రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రంలో తేడాలు ఉన్నాయి. యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల 'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. దానికి ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లు చెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు. రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం 'లఘురుద్రాభిషేకం'. 11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది. ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం', దీనిలో 14641 మారులు రుద్రం చెప్పబడుతుంది. ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం' హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్న సమస్త మాయాదోషాలు తొలగి, జీవుడు మరమాత్మలోనికి ఐక్యం చెందుతాడు.

శివ రాత్రి మహత్యం

శివరాత్రి మహత్యమును తెలుపు కథలు స్కంథ పురాణమునందును లింగపురాణము నందును పెక్కు కలవు. ఈ కథ లింగపురాణము లోనిది.
ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు కబుర్లాడు కొంటూన్నారు. "దేవదేవేశ! పాపం భూలోకములోని మానవులు ప్రారబ్ద కర్మలతో పెక్కు బాధలను అనుభవిస్తున్నారు. ఇటువంటివారికి కఠినమయిన నియమనిష్ఠలు లేకుండా యఙ్ఞయాగాదులు జపతపఫలములు లేని సులభతరమైన ఒక వ్రతమును తెలిపి వారికి క్తిని ముక్తిని కలుగునట్లు చేయుము" అని పార్వతి అన్నది.
అప్పుడు శివుడు పార్వతితో యిలా అన్నాడు."దేవి! శివరాత్రివ్రతము అనునది ఒకటి ఉంది. సర్వయఙ్ఞములకు సమానమయినది. ఉత్తమోత్తమయినది. ముక్తి ప్రదమైనది. దాని కథ చెబుతాను.
పూర్వము ఒక పర్వత ప్రాంతమున ’వ్యాథు’ డనే వేటగాడు ఉండేవాడు. అతను ప్రతి ఉదయము అడవికి వేటకు వెళ్ళి సాయంకాలానికి ఏదో ఒక ’మృగము’ ను చంపి ఇంటికి తెచ్చేవాడు. దానితో అతని కుటుంబము పొట్టనింపుకుంటూ ఉండేది.
ఒకరోజు అతను ఎప్పటిలా అడవికి వెళ్ళాడు. అడవి అంతా తిరిగినా అతనికి ఒక్క ’మృగము’ కంటపడలేదు. వట్టి చేతులతో యింటికి వెళ్ళటానికి మనసొప్ప లేదు. అయినా చేసేది లేక యింటికి బయలు దేరాడు. దారిలో అతనికి ఒక తటాకము కనబడింది. "ఏ మృగమైన నీరు త్రాగటానికి ఈ తటాకము దగ్గరకు రాకపోతుందా" అనే ఆశతో ఒక చెట్టుపైకి ఎక్కికూర్చున్నాడు. తటాకము వైపు చూస్తూ, అడ్డుగా ఉన్న కొమ్మలను విరిచి, ఆకులను దూసి క్రింద పడవేసి, చలికి ’శివ-శివ’ అనుకుంటూ తటాకము వైపు చూస్తూ కూర్చున్నాడు.
మొదటి జామునకు ఒక పెంటిలేడి నీరు త్రాగటానికి ఆ తటాకము దగ్గరకు వచ్చింది. వేటగాడు ఆనందముతో బాణము విడువబోయినాడు. "వ్యాథుడా! నన్ను చంపకు " అని మానవ గొంతుతో ఆ లేడి యిలా అన్నది. "నేను గర్భిణిని. నీకు అవథ్యను. నా వలన నీ కుటుంబానికి సరిపడు భోజనము లభించదు. కాబట్టి నన్ను వదులు.యింకొక "పెంటిజింక" కాసేపటిలో ఇక్కడకు వస్తుంది. దాన్ని చంపు. లేకపోతే నేను వెళ్ళి బిడ్డను కని దాన్ని బంధువులకి అప్పగించి వస్తాను " అంది. "సరే" అన్నాడు వేటగాడు.
రెండవ జామునకు పెంటిజింక కనిపించింది. మొదటి జింకే అనుకున్నవేటగాడు బాణము వేయబోగా ఆ జింక భయపడుతూ మానవ కంఠంతో "ఓ ధనుర్దారుడా! ముందు నా మాట విను. తరువాత నన్ను చంపవచ్చు.నేను విరహముతో కృశించిపోయి ఉన్నాను. నాలో మేదోమాంసములు లేవు.నన్ను చంపినా నీకు నీ కుటుంబానికి సరిపోను. కాసేపటికి బాగాబలిసిన "మగజింక" ఇక్కడకు వస్తుంది. దానిని చంపు. అలా కాకపోతే నేనే తిరిగి వస్తాను " అన్నది. సరేనన్నాడు.
మూడవజాము అయింది. వేటగాడు ఆకలితో జింక కోసము ఆతృతగా చూస్తున్నాడు.బలిసిన మగజింక రానేవచ్చింది. వేటగాడు దాన్ని చూసిన వెంటనే అల్లెత్రాడు లాగి బాణము విడువబోవునంతలో మృగము వేటగాడిని చూసి, తన ప్రియురాలినికూడా వాడే చంపి ఉంటాడని తలచింది.అయినా అడిగితే సందేహము తీరి పోతుందని " ఓ మహాసత్త్వుడా రెండు పెంకిజింకలు ఇక్కడకు వచ్చినవా!? అవి ఎటు పోయినవీ? వానిని నీవు చంపితివా" అని ప్రశ్నించెను. వేటగాడు దాని మాటలకు మునుపటి వలనే ఆశ్చర్యపడిరెండు "తిరిగి వస్తానని ప్రతిఙ చేసి వెళ్ళాయి.నిన్ను నాకు ఆహారంగా పంపాయి" అన్నాడు. "సరే అయితే! నేను ఉదయం నీ యింటికి వస్తాను.నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి, బంధుమిత్రులతో అనుమతి పొంది నేను మళ్ళీ వస్తాను" అని అనేక ప్రమాణాలు చేసి వెళ్ళింది.
యింతలో యింకొక హరిణి (జింక) తన పిల్లలతో వచ్చింది. "వ్యాధుడా! నేను పిల్లతో వచ్చాను. దీన్ని యింటి దగ్గర వుంచి త్వరగా వస్తాను అంది.
ఈ విధంగా నాలుగు జాములు గదిచిపోయాయి. సూర్యోదయమయింది. వ్యాదుడు జింక కొరకు ఎదురుచూస్తూ దిక్కులు వెతకసాగడు. కొంతసేపటికి నాలుగు జింకలు వచ్చాయి. "’ నేను సిద్దంగా ఉన్నాను నన్ను చంపు’ అంటే ’నన్ను చంపు’ అని నాలుగు జింకలు వ్యాదుని ఎదుట మోకరిల్లాయి.
మృగముల సత్యనిష్ఠకు వ్యాధుడు ఆశ్చర్య పడ్డాడు. వాటిని చంపుటకు అతని మనసు అంగీకరించలేదు. తన హింసావృత్తి మీద తనకే అసహ్యమేసింది. "ఓ మృగములారా ! మీరు మీ నివాసములకు వెళ్ళిపొండి. నాకు మీ మాంసము అక్కర్లేదు. కానున్నది కాకమానదు. ఈ విధంగా మృగాలను వేటాడి బందించి చంపి నాకుటుంబాన్ని పోషించుకోవటం పరమనికృష్టంగా తోస్తోంది. చేసిన పాపము చేశాను. ఇక తిరిగి ఈ పాపము చేయను.ధర్మములకు దయ మూలము. దయ చూపుటకూడ సత్యపలమే " అన్నాడు.
వ్యాధుని మాటలకు ఆకాశంలో దేవ దుందుభులు మ్రోగాయి.పూలవాన కురిసింది. దేవదూతలు మనోహరమయిన విమానములో వచ్చి " ఓ మహాసత్త్వుడా! ఉపవాసము , జాగరణ, శివరాత్రి ప్రభావమున నీ పాపము నశించింది. నీ వెక్కి కూర్చున్నది బిల్వ వృక్షము. నీకు తెలియకుండానే జాము జామునకు బిల్వదళాలను త్రుంచి క్రింద ఉన్న ’స్వయంభూలింగము’ను పూజించావు." అంటూ వారందరిని సశరీరంగా స్వర్గానికి తీసుకెళ్ళారు.
ఈ కథను పరమేశ్వరుడు పార్వతిదేవికి చెప్పి ’దేవి! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. కనిపించు మిగిలిన మూడు నక్షత్రములలో ముందున్నవి జింక పిల్లల్లు వెనుకకున్నది మృగి. ఈ మూడింటిని మృగశీర్షమంటారు. వాటి వెనుక ఉజ్జ్వలంగా ఉన్నది వేటగాని నక్షత్రము. శివరాత్రితో సమానమయిన మరియొక వ్రతము లేదు’ అని తెలిపెను.

ఉత్తర క్రియలు- శ్రీ విష్ణు పురాణము

శ్రద్ధతో శ్రాద్ధం చేసేవాడు బ్రహ్మేంద్రాది దేవతలతో పాటుపితృగణాలను, సమస్త భూత గణాలను సంతోషపరచిన వాడవుతాడు.శ్రాద్ధమునకు తగిన ద్రవ్యం, విశిష్టమైన బ్రాహ్మణుడు సంప్రాప్తించేలా చూసుకొని శ్రాద్ధం పెట్టాలి. ఒక అభిప్రాయం ప్రకారం పితృతర్పణాదులకు నియతకాల విధులు అన్నవి లేవు.సూర్యచంద్రులు సమరీతిగా వెలుగొందే విషువత్‌ దినాల్లో గాని, మేషవృషభాది సంక్రమణ పుణ్యకాలాల్లో గాని, సూర్యగ్రహణాది సమయాల్లోగాని, కొత్తపంటలొచ్చేకాలంలోగాని, ఇచ్ఛాశ్రాద్ధాలు చేయ్యొచ్చు!వీటివల్ల పితృదేవతలకు గొప్ప ఆనందం కలుగుతుంది.పుష్యమి, ఆర్ద్ర, పునర్వసు, అనూరాధ, విశాఖ, స్వాతి, ధనిష్ఠ, పూర్వభాద్ర, శతభిషానక్షత్రాలు అమావాస్యతో కూడి రాగా వచ్చినపుడు పెట్టేశ్రాద్ధం పితృదేవతలకు ఇంకా అధికంగా తృప్తినిస్తుంది. పితృభక్తుడైన థైలుడు అడగ్గా సనత్కుమారముని అడిగిన మరోరకమైన శ్రాద్ధం చెప్తాను.
సనత్కుమారుడిలా చెప్పాడు...
వైశాఖశుద్ధ తదియ, కార్తీక శుద్ధ నవమి, భాద్రపద కృష్ణ త్రయోదశి, మాఘ బహుళ ఆమావాస్య.... ఈ 4 తిథులు గొప్పపవిత్రమైనవి. ఈ విషయం పురాణోక్తం. సూర్యచంద్ర గ్రహణాదులప్పుడు, తిస్రోష్టకాలు వచ్చినపుడు, దక్షిణాయనం - ఉత్తరాయణం ప్రవేశించేటపుడు పుణ్యకాలాల్లోను మంచినీరు - నువ్వులతో కలిపి అయినా పితృదేవతల కోసం నియమంగా తర్పణాలు విడవాలి. అలాచేస్తే పితృదేవతలు దేవకాలమానం ప్రకారం వేయి సంవత్సరాలు తరిస్తారు.ధనిష్థ పౌర్ణమితో కలిసినపుడు, బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే పితృదేవతలకు పదివేలసంవత్సరాలు తరించే యోగం కలుగుతుంది.భాద్రపదంలో ఆర్ద్రానక్షత్రంతో కూడిన పూర్ణిమవేళ శ్రాద్ధావిధులు ఆచరిస్తే పితృదేవతలకు యుగాంతం వరకు పుణ్యలోకగతులు కలుగుతాయి.మాఘ బహుళ అమావాస్య శతభిషానక్షత్రంతో కలిసి వచ్చినపుడు శ్రాద్ధావిధి నిర్వర్తించడం వల్ల అత్యధిక పుణ్యం పితృదేవతలకు సిద్ధిస్తుంది.
పితృదేవతలకు పిండోదకాలు వదలి, గంగాది జీవనదుల్లో స్నానం చేసే మోక్షగాములకు పాపములన్నీ నశించి అశేష ఫలితాలు కల్గుతాయి.పితృదేవతల చేత పాడబడిన ఈ గీతం వినురాజా! వారి కోరిక ప్రకారం నువ్వు జరిగించి ధన్యుడివి కమ్ము! పితృదేవతలు ఇలా భావిస్తారట -'మన వంశంలో ఉండీ లేదనుకొనే పిసినారి తనం (విత్తశాఠ్యం) వల్ల మనకు పిండప్రదానం చేయనివాడు పుట్టకుండుగాక! సంపదగల్గి మనల్ని ఉద్దేశించి బ్రాహ్మణులకోసం అన్న వస్త్ర ధన భోగాదులు ఇచ్చేవాడు పుట్టుగాక! నువ్వు గింజలతోనైనా జలాంజలి ఇచ్చేవాడు పుట్టునా? అదీ సాధ్యంకాకుంటే, ఆవుకింత పిడికెడు గడ్డిని మా తృప్తి కోసం ఇచ్చేవాడు పుట్టునా? అదీ చేయశక్తిలేనివాడు, కనీసం మనకు నమస్కరించి తృప్తి పడమనే వాడు పుడతాడా?' అని గానం చేస్తుంటారట.ఔర్యుడిలా అన్నాడు...."కలిమి లేములను బట్టి ఏది చెయ్యబడినా పై వాటిలో పితృదేవతా ప్రీత్యర్థమవుతుందని వారిచేతనే ఇది పలకబడింది. శక్తి ఉన్నదా? లేదా తర్కించుకుని ఎవరికి వారే పైన చెప్పినట్లు ఆచరించవచ్చు".
శ్రాద్ధ భోక్తలు
శ్రాద్ధమునకు భోజనాదికాలు ముఖ్యం గనుక, ఎటువంటి భోక్తలను నియమించాలో ఔర్యుడు చెప్తూన్నాడు..
బ్రాహ్మణార్థం పిలవదగిన బ్రాహ్మణునికి కనీస పాండిత్యంగా కృష్ణయూర్వేదంలోని మూడు అనువాకములైన చదివిన వాడై ఉండాలి. వేదాధ్యయనశీలి - వేదసారాన్ని నిజజీవితంలో ఆచరించగలిగిన వాడు అయి ఉంటే ఇంకా శ్రేష్థం! ఎన్నెన్నో యజ్ఞాలను చేయించినవాడు, తపోనిష్ఠుడు, మాతాపితరుల పట్ల శ్రద్ధగలవాడు అర్హుడు.
స్వంతబంధువర్గంలోనైనా సరే! శ్రాద్ధాభోక్తగా నిమంత్రణానికి అర్హులైనవారిలో మేనల్లుడు, కూతురి కొడుకు, తనకు అల్లుడు, మామగారు, ఇష్టుడైన శిష్యుడు, మేనమామ...వీరంతా అర్హులే!

మాఘపురాణం - 26వ అధ్యాయము సుధర్ముడు తండ్రిని చేరుట

పాపమా బాలుని జాతకము ఎటువంటిదో గాని తన తల్లి అడవిలో పులిచే చంపబడింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయినది. ఇక ఆ పిల్లవానిని దీన రక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడ్చీ ఏడ్చీ అలసి నిద్రపోయాడు. అక్కడొక తులసిమొక్క వున్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసిచెట్టు పై బడినందున ఆ రాత్రి అతనికే అపాయమూ కలుగలేదు. పైగా దైవభక్తి కలిగెను. ఉదయమే లేచునప్పటికి అడవిలో ఏకాంతముగా నున్నందున భయపడి బిగ్గరగా ఏడ్చినాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదనచేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఇచ్చుచుండెడివి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభి వృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి వుండెనో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచు కాలము గడుపుచుండెను.
అలా పెరుగుతూ పన్నెండేండ్లు ప్రాయం గల వాడయ్యెను. ప్రతి దినము తులసి పూజ భగవన్నామ స్మరణ చేస్తూ “నన్ను కాపాడుము తండ్రీ అనాధరక్షకా” అని ప్రార్థించుచు, ఒక్కొక్కప్పుడు విరక్తుడై “ఛీ ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా? నేను బ్రతికెందుకు?” అని దుఃఖించుచుండగా, ఆకాశవాణి “ ఓ బాలచంద్రా! నీవట్లు విచారింపకుము. ఈ సమీపముననే ఒక కోనేరు వున్నది. మాఘమాసం ప్రవేశించినది. అందుచే నీవా సరస్సులో స్నానం చేసినయెడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును” అని పలికిన మాటలు ఆకాశమునుండి వినిపించినవి. వెంటనే ఆరాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించెను.
ఈ బాలుని నిష్కళంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీ నారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి “బాలకా నీకేమి కావలయునో కోరుకొనుము” అని యనగా “ప్రభూ! నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనా పాలనా చేయువారెవరైననూ లేరు. పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరుగను. ఈ వనచరములే నన్ను రక్షించి పోషించుచున్నది. గాన మీ సన్నిధానమునకు నన్ను తీసుకొని పొండు. మరేమియు అక్కరలేదు” అని ప్రార్థించెను.
“ఓయీ రాజనందనా! నీవు ఇంకను భూలోకమునందు ధర్మంగా పరిపాలన చేయవలసిన యవసరమున్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీగురించి నీ కన్నతల్లిని గురించి బెంగతో ఉన్నాడు. గాన నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్ము” అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకొనుచున్న ఒక మునీశ్వరునితోడు యిచ్చి సులక్షణుని వద్దకు పంపెను.
అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భావిటిగా వుండి ఎటుపోయెనో, పుట్టిన బిడ్డ ఏమాయెనో అని తన రాజ్యమంతయు వెదకించి తానును వెదకి వారి జాడ తెలియనందున విచారమనస్కుడై రాచకార్యములు చూడకుండెను. అటువంటి సమయములో మునివెంట కుమారుడు వెళ్ళెను. రాజుతో ముని యా బాలుని జన్మవృత్తాంతం తెలియజేయుసరికి సులక్షణ మహారాజు అమితానందభరితుడై బాలుని కౌగలించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకము చేసెను.

మాఘపురాణం - 27వ అధ్యాయము ఋక్షక యను బ్రాహ్మణ కన్య వృత్తాంతము

పూర్వము భృగుమహాముని వంశమందు ఋక్షకయను కన్య జన్మించి దిన దినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను.
ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు బోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను.
ఆవిధంగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన ననేక మాఘ మాస స్నాన ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడింది. ఒకనాడామె తపస్సు చేసుకొనుచూ ప్రాణములు విడిచెను. ఆరోజు వైకుంఠ ఏకాదశి అగుట వలన వైకుంఠమునకు వెడలెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘ మాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్య లోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి “తిలోత్తమా”యను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సుయొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై “మీకేమి కావలయును? కోరుకొనుడు” అని అనగా “స్వామీ! మాకు ఇతరుల వలన మరణము కలుగకుండా ఉండునట్లు వరమిమ్ము” అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చితినని చెప్పి అంతర్ధానమయ్యెను.
బ్రహ్మ దేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహా గర్వము గలవారై దేవతలను హింసించి మహర్షుల తపస్సులకు భంగము కలిగించు చుండిరి. యజ్ఞయాగాది క్రతువులలో మాంసం, రక్తం, పడవేసి ప్రజలను నానాభీభత్సములు చేయుచుండిరి. దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి.
ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని “మహానుభావా! సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము గలవారై తపశ్శాలురను బాధించుచూ దేవలోకమునకు వచ్చి మమ్మందరనూ తరిమి చెరసాలలో పెట్టి నానా భీభత్సం చేయుచున్నారు. గాన వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించు”మణి దేవేంద్రుడు ప్రార్థించెను. బ్రహ్మ దీర్ఘముగా నాలోచించి తిలోత్తమను పిలిచి “అమ్మాయీ! సుందోపసుందులను రాక్షసులను ఎవరి వలననూ మరణం కలుగదని వరం ఇచ్చియున్నాను. వర గర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు గాన నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునటుల ప్రయత్నించుము” అని చెప్పెను.
తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమును ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచూ ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధుర గానమును విని సుందోపసుందులు తిలోత్తమును సమీపించిరి. ఆమె ఎటు పోయిననటు, ఎటు తిరిగిననటులామెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుంటిరి. ఆమెను “నన్ను వరింపుము” యని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడ సాగిరి.
ఓ రాక్షసాగ్రేసరులారా! మిమ్ములను పెండ్లియాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి యెడల ప్రేమతో నున్నాను. ఇద్దరినీ వివాహమాడుట సాధ్యం కానిది. గాన నాకోరిక ఒకటున్నది. అది ఏమనగా “మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమించగలను” అని తిలోత్తమ చెప్పెను. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింప జేశాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు అంటే, లేదు నేనే బలవంతుణ్ణి అని ఉపసుందుడు అన్నాడు. ఇద్దరికీ వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది. మనిద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు. గదాయుద్ధము, మల్లయుద్ధము చేశారు. పలురకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించడంతో ఇద్దరూ చనిపోయారు. వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించారు. తిలోత్తమను పలువిధాలుగా శ్లాఘించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి “తిలోత్తమా! నీ చాకచక్యంతో సుందోపసుందుల పీడను తొలగించావు. దేవతలందరికీ ఆరాధ్యురాలవైనావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ మరొకటి కాదు. ఇకనుండి నీవు దేవలోకములో అందరిచే అధికురాలిగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైనది. వెళ్ళు. దేవలోకంలో సుఖించుము” అంటూ ఆమెను దేవలోకానికి పంపాడు.

మహాశివరాత్రి రోజున జాగారం చేస్తే పునర్జన్మంటూ ఉండదట

శివుడికి సంబంధించిన పండుగలన్నింటినిలోనూ ముఖ్యమైనది, పుణ్యప్రదమైనది మహాశివరాత్రి. ప్రతినెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశి తిథిని మాస శివరాత్రి అంటారు. మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశికి మహాశివరాత్రి అని పేరు. శివరాత్రి పండుగను జరుపుకోవడంలో ప్రధానమైన విషయాలు మూడు ఉన్నాయి.
శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి, స్నాన సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి.
శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవాలి ఇది శివార్చన. ఇక రెండోది ఉపవాసం. ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేయడం మాత్రమే. కానీ ఉపవాసమంటే ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు తెలియజేస్తోంది.
మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు-నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటం. ఈ విధంగా జాగారం చేసిన వారికి మళ్లీ తల్లిపాలు తాగే అవసరం పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పాపాలను నశింపజేస్తుంది.
శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతూనో, ఎటువంటి ప్రయోజనమూ లేని వాటిని చూస్తునో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివగాధలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యమూ, పురుషార్థమూ రెండూ లభిస్తాయని పురోహితులు చెబుతున్నారు.
పూర్వం గుణనిధి అనే దుర్మార్గుడు శివరాత్రి నాటి రాత్రి ఆకలితో ఒక శివాలయంలోకి వెళ్లాడు. నైవేద్యం కోసం ఉంచిన అన్నాన్నీ పిండి వంటలనూ కాజేద్దామనుకున్నాడు. తెల్లవార్లూ కునుకులేకుండానే ఉన్నాడు. దీప జ్వాల కొండెక్కుతుంటే వత్తిని ఎగదోశాడు. ఉత్తరీయం అంచును చించి, దారపు పోగులను వత్తిగా చేసి, ఆవునెయ్యిపోసి వెలిగించాడు.
ఆ వెలుతురులో అన్నపు గిన్నెను కాజేసి, పరిగెత్తుతూ తలారి వేసిన బాణపు దెబ్బవల్ల మరణించాడు. ఈ పుణ్యానికే ఆ గుణనిధి మరుజన్మలో కళింగ దేశాధిపతియైన అరిందముడికి దముడు అనే కుమారుడిగా జన్మించాడు.
ఆ జన్మలో మహారాజై, అనేక శివాలయాల్లో అఖండ దీపారాధనలు చేయించి, ఆ పుణ్యం వలన ఆ పై జన్మలో కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడైనాడు. ఇలా పరమేశ్వరుడికే ప్రాణసఖుడైనాడని పురణాలు చెబుతున్నాయి.
అందుచేత మహాశివరాత్రి రోజున మనం కూడా ముక్కంటిని భక్తి శ్రద్ధలతో పూజించి పుణ్యఫలాల్ని పొందుదాం..!!

శివుడి ఆనందతాండవము - నటరాజ స్వామి

""నట" అనే ధాతువుకు స్పందించడమని అర్ధం. తన భక్తులను ఆనందపారవశ్యంలో ముంచెత్తేందుకు స్వామి అనేక సంధర్బాలలో నాట్యం చేసినట్టు పురాణవచనం. పరమ శివుడు సదా ప్రదోషకాలంలో,హిమాలయాలలో, కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు.ఆనందముగ ఉన్నప్పుడు మాత్రమే కాదు దుష్ట సమ్హారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తు ఉంటాదు అనేది విదితం. గజాసురుణ్ణి సమ్హరించేతప్పుడు,అంధకాసుర సమ్హారంలోను శివుడు చేసిన నృత్యం భైరవరూపంలో మహా భయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందంకోసం రూపాన్ని ధరించి నృత్యం చేస్తాడని నృత్తరత్నావళి ద్వారా మనకు తెలుస్తోంది.
స్వామి నాలుగు చేతులలో నెమలి ఈకలు కట్టిన జడలతో, ఆ జడలలో ఒక సర్పం, ఒక కపాలం,గంగ,దానిపై చంద్ర రేఖ,కుడి చెవికి కుండలం, ఎడమ చెవికి తాటంకం ,కంఠహారాలతో, నూపురాలతో,కేయూరాంగదాలతో,యఙ్ఞోపవీతంతో, కుడి చేతిలో ఢమరుకం ,మరొక కుడిచేయి అభయ ముద్రను ప్రకటించడం,ఒక ఎడమ చేతిలో అగ్ని,మరొక చేయి సర్పాన్ని ,చేతిలో పెట్టుకున్న మూలయకుణ్ణి చూపిస్తూ, ఎడమకాలు ఎత్తి పెట్టబడినట్లుగా,విగ్రహానికి చుట్టూ ఓ కాంతి వలయం, పద్మాకారంగ చెక్కబడిన పీఠంపై నృత్యం అద్భుతం.
చెవి కుండలములు - అర్ధనారీశ్వరతత్వము
వెనుక కుడి చేతిలో డమరుకం - శబ్దబ్రహ్మయొక్క ఉత్పత్తి
వెనుక ఎడమ చేతిలో అగ్ని - చరాచరముల శుద్ధి
ముందు కుడి చేయి - భక్తులకు అభయము
ముందు ఎడమ చేయి - జీవులకు ముక్తి హేతువయిన పైకి ఎత్తిన పాదమును సూచించును.
కుడి కాలుకింద ఉన్న అపస్మార పురుషుడు (ములయక రాక్షసుడు) - అఙ్ఞాన నాశనము
చక్రము - మాయ
చక్రమును స్పృశించిన చేయి - మాయను పవిత్రము చేయ్తుట
చక్రమునుండి లేచు 5 జ్వాలలు - సూక్ష్మమైన పంచతత్వములు
నాట్యం చేస్తున్నప్పుడు నటరాజుకు నాలుగు భుజాలు ఉంటాయి.ఆయన చేసే నృత్యాలు ఏడు రకాలుగా ఉంటాయి.
1) ఆనంద తాండవం
2) ప్రదోష నృత్యం ( సంధ్యా తాండవం)
3) కాళితాండవం
4) త్రిపురతాండవం
5) గౌరి తాండవం
6) సమ్హార తాండవం
7) ఉమా తాండవం
గౌరి ,ఉమా తాండవాలలో శివుని రూపం భైరవముగా ఉంటుంది. ఆయన సాత్విక నృత్యం ప్రదోషకాల నృత్యమే. అందుకే ప్రదోషకాలంలో శివపూజ ప్రశస్తమైనది.
అసలు భూలోకంలో ఉన్న నృత్యరూపాలు అన్ని ఆయన నృత్యంలో నుండి ఉద్భవించినవే!
ఆయన తన నృత్యమును,పార్వతి ద్వారా అభినయింప జేసి, తమ నాట్యాన్ని భరతమునికి చూపించగా,భరత ముని ద్వారా నాట్య వేదం రూపుదిద్దుకుందంటారు.
సమ్హారకరమైన శివుని ఉగ్రనృత్యములందు జగత్తును ప్రళయం గావించి,జీవుల కర్మబంధమును కూడా నశింపచేయును.
ఆనంద తాండవమునందు శివుని ముద్రల అంతార్ధము ఇదే. ఆయన తాండవము లోకరక్షాకరం.

మాఘపురాణము 28వ అధ్యాయం - విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ

పూర్వము బ్రహ్మ, ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని. నేను సర్వేశ్వరుడను, పధ్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు శివుడు. కాదు, ఈ పధ్నాలుగు లోకాలను, సమస్త చరాచర జీవరాశినీ, సృష్టించిన సృష్టికర్తను నేను. కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు. వాదప్రతివాదములు, తర్కమీమాంసలతో వెయ్యేళ్ళు గడిచిపోయినవి. ఇద్దరూ వాగ్వివాదంలో మునిపోయారేమో సృష్టి కార్యం అంతా స్తంభించి పోయింది. అంతట శ్రీమహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, ఈశ్వరులు ఇద్దరూ సమస్త లోకములూ ఇమిడివున్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. సప్త సముద్రాలు, సమస్త విశ్వమూ, ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించుచున్నాయి. అ విరాట్ రూపుని ఎడమచెవిలో శంకరుడు, కుడిచెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపమునకు ఆద్యంతములు లేవు. సర్వత్రా తానై ఉన్నాడు. అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాధిదేవులు, దేవతలు, రాక్షసులు, మునులు సమస్తమూ భగవంతుని కీర్తిస్తూ కనపడుచున్నారు. నదీనదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములూ సమస్తమూ కనపడుచున్నవి. భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతున్నాయి. కోటి సూర్య కాంతుల వెలుగులలో ప్రకాశింపబడుతున్నాడు. సామాన్యులకు సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు. ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివర ఎక్కడో తెలియడం లేదు. ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్న వారే అధికులనీ, బ్రహ్మ, ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు. ఇరువురూ వెంటనే బయలుదేరి వెయ్యేళ్ళు తిరిగి ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఇట్లు తలపోశారు. ఆహా! ఏమి ఇది? బ్రహ్మ, ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక పోయితిమి. అంటే మనం అధికులం కాదన్నమాట. సమస్తమునకూ మూలాధారమైన శ్రీమహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట. సృష్టి స్థితి లయ కారకుడతడే. అతడే సర్వాంతర్యామి. జగములనేలే జగదాధారుడతడే. పంచభూతాలు, సూర్యచంద్రులు, సర్వమూ ఆ శ్రీమన్నారాయణుడే. కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వమూ అయి వున్నాడు. మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని నిర్ణయించుకున్నవారై శ్రీమహావిష్ణువును స్తోత్రం చేయగా విష్ణువు విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలమునుండి వాదించు కొనుచున్న విషయము తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను. నా విరాట్ రూపముయొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేశారు. మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపెదను వినండి. “సమస్తమునకూ మూడు గుణములు నిర్దేశించబడ్డాయి. వీటీనే త్రిగుణములు అంటారు. అవి సత్త్వరజస్తమోగుణములు. మీరు రజస్తమో గుణములు కలిగిన వారు. ఎవరైతే సత్త్వరజస్తమో గుణములు కలిగిఉందురో వారే గొప్పవారు. తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి. అవి సృష్టిస్థితి లయలు. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసితిని. కావున వీరిని త్రిమూర్తులు అందురు. త్రిమూర్తులు అనువారు ముగ్గురు కాదు. ఏక స్వరూపమే. సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులమైనాము. కావున మీరు వేరు, నేను వేరు అనునది లేదు. అంతా ఏకత్వ స్వరూపమే. కావున మన ముగ్గురిలో ఎవరికీ పూజలు చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి. త్రిమూర్తులమైన మనలో భేదముండదు. రజస్తమో గుణముల ప్రభావముచే మీరిట్లు ప్రవర్తిన్చిరి. శాతమునొంది చరింపుడు. బ్రహ్మదేవా! నీవు ఎక్కడినుండి ఉద్భావిన్చావు? నా నాభికమలము నుండియే కదా! కావున నీకును, నాకును బెధమున్నడా? లేదు. అట్లే ఓ మహేశ్వరా! ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనమును తెలియగోరి నారదుడొకనాడు నీ మహాత్మ్యమును తెలుపమనగా నేను నీయొక్క మహిమను సర్వస్వమును వినిపించితిని. నాటినుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకూ విస్తరింపజేశాడు. ఓ సాంబశివా! నువ్వు నిర్వికార నిరాకల్పుడవు. శక్తి స్వరూపుడవు, త్రినేత్రుడవు, సర్వేశ్వరుడవు, ఆదిదేవుడవు నీవే. ఆత్మ స్వరూపుడవు నీవే. భోళా శంకరుడవైన నీవే ఇంత పంతము పట్టదగునా? నేనే నీవు, నీవే నేను అందుకే శివకేశవులని భక్తులు భజియుంతురే! పూజింతురే! నిత్య సత్య స్వరూపుడవు. నిత్యానంద రూపుడవు. నిత్య ధ్యాన స్వరూపుడవు. అర్థ నారీశ్వరుడవు. నీవుకూడా నాతొ సమనుడవే” అంటూ బ్రహ్మకు, శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేసెను. కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడగు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తులగుటయే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు.

హరుడు నెలవై వున్న అరుదైన కొన్ని క్షేత్రాల గురించి తెలుసుకుందాం. వీటిలో ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత వుంది.

శివరాత్రి పర్వదినాన ఆ హరుని నామస్మరణ... ఎన్నో జన్మల పుణ్యఫలాన్ని అందిస్తుందంటారు. అలాగే హరహర మహాదేవ నమఃశివాయ అంటూ ఈ రోజున హరుని దర్శనం చేసుకుంటే ముక్తి లభిస్తుందంటారు. ఆ హరుడు నెలవై వున్న అరుదైన కొన్ని క్షేత్రాల గురించి తెలుసుకుందాం. వీటిలో ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత వుంది.
నందిలేని శివాలయం...
నంది లేని శివాలయం గురించి తెలుసా? శివాలయం అనగానే ఎదురుగా నంది వుంటుంది. కానీ అనంతపురం జిల్లా అమరాపురం హేమావతి గ్రామంలోని సిద్ధేశ్వరాలయం.... శివుడి ఎదురుగా నంది లేని శివాలయం. ఇక్కడ శివుడు ఉగ్ర రూపుడిగా దర్శనమిస్తాడు. దక్షయజ్ఞం జరిగిన సమయంలో భర్త వద్దన్నా తండ్రి చేసే యాగానికి బయల్దేరి వెళ్తుంది సతీదేవి. ఆ సతీదేవి వెంట తన వాహనమైన నందిని కూడా తోడుగా పంపుతాడు శివుడు. అయితే అక్కడ జరిగిన అవమానానికి సతీదేవి తన ప్రాణాలను అర్పిస్తుంది. సతిని కోల్పోయిన శివుడు ఉగ్రతాండవం చేశాడు. ఆ ఉగ్రశివుడి రూపమే ఇక్కడ మనకి కనిపించేది. ఈ ప్రాంతాన్ని పాలించిన శివభక్తుడు నాళంబరాజు కట్టించిన ఆలయం ఇది. సతి వెంట నంది వెళ్ళినందున ఈ శివాలయంలో నంది విగ్రహం వుండదు.
ఆరు నెలలు మాత్రమే తెరిచే శివాలయం
ఏడాదికి ఆరు నెలలు మాత్రమే తెరచి వుండే శివాలయం గురించి విన్నారా? ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు, కృష్ణాజిల్లా జగ్గయ్య పేట మండలం మక్త్యాల గ్రామాల మధ్య కృష్ణానది మధ్యలో ముక్తేశ్వరుడిగా పూజలందుకునే ఆ స్వామి సంవత్సరంలో ఆర్నెల్లపాటు కృష్ణమ్మ ఒడిలో దాగుంటాడు. ఆ సమయంలో స్మామిని దేవతలు ఆరాధిస్తారని ప్రతీతి. కృష్ణమ్మ వరద తగ్గినప్పుడు ఈ ఆలయం భక్తులకు కనిపిస్తుంది. ఇక్కడ మరో విశేషం కూడా వుంది. సాధారణంగా శివయ్యని లింగ రూపంలో చూస్తుంటాం. ఇక్కడ అమ్మవారిని కూడా లింగ రూపంలో అర్చిస్తారు. అంటే, ఇక్కడ రెండు లింగాలు, రెండు నందులు, రెండు ఆలయాలు మనకి కనిపిస్తాయి. ఇక్కడ దక్షిణం వైపు వున్న నందిని తిరుగుడు నందిగా పిలుస్తారు.
శివలింగానికి ఝటాఝూటం
శివుడిని ఝటాఝూటంతో చూస్తాం. కానీ, లింగరూపంలో వున్న స్వామిని ఝటాఝూటంతో చూడగలమా... సాధ్యమే... అలా ఆ స్వామి దర్శనం కావాలంటే, తూర్పుగోదావరి జిల్లాలోని పలివెల వెళ్ళాలి మనం. అక్కడ శివుడు శ్రీ ఉమా కొప్పులింగేశ్వరుడిగా మనకి దర్శనమిస్తాడు. హరుడి తలపై కొప్పు, పక్కన అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తూ కనిపిస్తారక్కడ.
తోజోలింగ స్వరూపం
తేజోలింగ రూపంలో ఆ హరుడిని దర్శించుకోవాలనుకుంటే గుంటూరు జిల్లా చందోలు వెళ్ళాలి. లింగోద్భవ క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రంలో 11 అడుగుల ఎత్తు, నాలుగున్నర అడుగుల వైశాల్యం కలిగిన నల్లరాతి శివలింగం వుంది. అతి ప్రాచీనమైన ఈ క్షేత్రంలో ఆ తేజోలింగం ఆరుబయట మనకి దర్శనమిస్తుంది. లింగంపై హంస రూపంలో బ్రహ్మ, అడుగుభాగాన వరాహ రూపంలో విష్ణుమూర్తి రూపాలు కనిపిస్తాయి.
శివలింగంపై గంట్లు
నర్సరావుపేట పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేజెర్ల కపోతేశ్వరాలయం గురించి విన్నారా? ఇక్కడ లింగంపై గంట్లు కనిపిస్తాయి. అలాగే ఈ లింగానికి కుడి -ఎడమలలో రెండు బిలాలుంటాయి. కుడి బిలంలో ఒక బిందె నీరు పడుతుంది. కానీ ఎడమ బిలంలో ఎంత నీరు పోసినా నిండనే నిండదు. అలాగే ఇక్కడ నందీశ్వరుడు కపోతేశ్వరుడిని కుడికంటితో వీక్షించడం ఇక్కడి మరో ప్రత్యేకత. దాన చక్రవర్తి శిబి లింగ రూపాన వెలసిన క్షేత్రం ఇది అంటారు. పావురాన్ని కాపాడటం కోసం శిబి తన దేహం నుంచి మాంసాన్ని కోసిన దానికి గుర్తుగా ఇక్కడ లింగానికి గంట్లు కనిపిస్తాయని భక్తుల విశ్వాసం.
శివలింగంపై పావురాలు
శివలింగం పైభాగంలో రెండు పావురాలు, మంటపంలో నంది వెనుక భాగంలో వేటగాడు... ఇంకెక్కడా కనిపించని ఈ విశేషం కేవలం తూర్పుగోదావరి జిల్లా కడలి కపోతేశ్వరాలయంలో మాత్రమే మనకి దర్శనమిస్తుంది.
లింగ రూపంలో పార్వతీ పరమేశ్వరులు
శిలారూపంలో పార్వతీ పరమేశ్వరుల దర్శనం కావాలన్నా, కోరిన కోర్కెలు నెరవేరాలన్నా కర్ణాటక రాష్ట్రంలోని సూర్య గ్రామం వెళ్ళాల్సిందే. కర్ణాటక రాష్ట్రం దక్షణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి తాలూకాలో వుంది ఈ సూర్య గ్రామం. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలకు 12 కిలోమీటర్ల దూరంలో వుందీ క్షేత్రం. ఇక్కడ శివరుద్ర స్వామి లింగ రూపంలో వెలిశాడని ప్రతీతి. దేవాలయానికి సమీపంలో ఒక ఉద్యానవనం వుంటుంది. ఇందులో రెండు శిలారూపాలుంటాయి. వీటినే శివపార్వతులుగా భావించి పూజిస్తారు భక్తులు. ఇక్కడి విశేషం.... మనం కోరిన కోర్కె తీరితే ఆ కోర్కెని బొమ్మ రూపంలో స్వామికి మొక్కుగా చెల్లించాలి. అంటే, ఇల్లు కట్టుకోవాలన్న కోర్కె తీరితే ఇంటి బొమ్మ, పిల్లలు కావాలన్న కోర్కె తీరితే పసివాడి బొమ్మ... ఇలా ఏ కోరిక తీరితే దానికి సంబంధించిన ఒక మట్టిబొమ్మను ఇక్కడి స్వామికి ఇస్తుంటారు భక్తులు. అలాగే ఇక్కడి ఉద్యానవనం దాటి లోపలకి వెళ్తే గుట్టలు గుట్టలుగా ఉన్న రకరకాల బొమ్మలు కనిపిస్తాయి మనకి.

మన హిందూ వాజ్మయం ప్రకారం ప్రతి హిందువు తొమ్మిది రీతులుగా ధర్మాన్ని ఆచరించాలి.

1. సత్సంగం - మంచివారితో ఉండడం.
2. హరికథ - పవిత్ర సంకీర్తన కథాకాలక్షేపం.
3. ఈశ్వరభక్తి - పరమాత్మపట్ల భక్తి.
4. తీర్థయాత్ర - పవిత్ర క్షేత్ర దర్శనం.
5. గురుపూజ - గురుజనులను పూజించుట
6. ధ్యానం - పరమాత్మపై మనస్సు కేంద్రీకరించుట
7. భాగవతసేవ - భగవంతుని భక్తులను ఆదరించి సేవించుట
8. జపం - పరమాత్మ పవిత్ర నామాన్ని చెప్పుకొనుట లేక జపించుట.
9. లోక కల్యాణం - సకలజీవులకు సేవచేయుట.

మొగలి పువ్వుకు శాపము


ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగ మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగిరి. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించెను. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేషశయ్యపై నిద్రించుచున్న విష్ణువును చూసి, "నీవెవరవు నన్ను చూసి గర్వముతో శయ్యపై పరుండినావు లెమ్ము. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడును" అని అన్నాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీ చూపులు ప్రసన్నంగా లేవేమి?" అన్నాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చినాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించువాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అన్నాడు.
ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదములోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభించారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేయుచుండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తున్నారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగిరి. ఇలా సమరం జరుగుచుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొన్నారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గింది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరారు. ప్రమథగణాలకు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసంలో మణులు పొదగబడిన సభా మధ్యంలో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో, అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవి తో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు. మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుకొనుటకు హంసరూపుడై బయలుదేరారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వచ్చాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు(బ్రహ్మ, విష్ణువుల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకున్నాడు. వాటితో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెప్పాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మకి షోడశోపచారాలతో పూజ చేసాడు. కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెప్పింది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు. మోసము చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్ష మయ్యాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరించారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదించాడు.
.
ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి , అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉMచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీపుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీపుష్పము ఛత్ర రూపములో నాపై ఉంటుంది అని చెబుతాడు.

మాఘపురాణం - 25వ అధ్యాయము

సులక్షణ మహారాజు వృత్తాంతము వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను. అతనికి నూర్గురు భార్యలు గలరు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజల కేయాపద వచ్చిననూ తనదిగా భావించి తన్నివారణోపాయం చేసెడివాడు. సులక్షణ మహారాజెంతటి రాజాధిరాజైననూ యెంతటి తరగని సంపత్తికలవాడైన నేమి లాభం? “అపుత్రస్యగతిర్నాస్తి” అనునటుల పుత్రసంతానం లేకపోవుటచే తనకు గతులు లేవు కదా! కాగా తన వంశం ఎటుల అభివృద్ధి చెందును? తనతో తన వంశం అంతరించి పోవలసినదేనా? అని దిగులు చెందుచుండెను. ఒకనాడు తాను తన రధమెక్కి నైమిశారణ్యమున గొప్ప తపశ్శాలురున్న ప్రదేశమునకు వెళ్ళెను. అచట తపోధనులందరూ తపస్సు చేసుకొనుచుండిరి. వారికి సులక్షణ మహారాజు నమస్కరించి యిటుల పలికెను – “మునిశ్రేష్ఠులారా! నేను వంగ దేశాధీశుడను. ణా పేరు సులక్షణుడందురు. నాకు నూర్గురు భార్యలు. అయిననేమి? ఒక్క సంతానమైనను కలుగలేదు. గాన నాకు పుత్రసంతానం కలుగునట్లోనరింపుడు” అని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహారాజు పలుకులకు ముని శ్రేష్ఠులు విని జాలినొందిరి. “రాజా! నీవు సంతానహీనుడవగుటకు కారణమేమనగా – పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పాలించియుంటివి. ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైననూ చేయలేదు. ఒక్క దానమైననూ ఇవ్వలేదు. ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయనైనా దానం చేసియున్నచో ఈ జన్మలో పుత్రసంతతి కలిగి వుండేది. గాన వెనుక కర్మఫలం వలననే నీకీ జన్మలో పుత్రసంతతి కలుగలేదు. ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూష్మాండ దానం చేయుదురో వారికి తప్పక పుత్రసంతానం కలుగగలదు. ఇందుకు సందేహమేమియు లేదు” అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునకిచ్చి “దీనిని నీ భార్యలహే జీవిమ్పజేయుము” అని పలికిరి. మహాభాగ్యం అని ఫలమును కండ్లకద్దుకొని యింటికి వెళ్ళిపొయినాడు. భర్త రాకవిని పట్టమహిషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేద దీర్చిరి. రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి “భోజనానంతరం సేవిమ్పుడు” అని చెప్పి తన గదియందు ఫలమును భద్రపరచి తానూ భోజనశాలకు పట్నులతో వెడలిపోయెను. నూర్గురు భార్యలలో కడసారి భార్యకు మిక్కిలి ఆశకలిగి ఫలమంతయు నేనే భుజించేదానని తలపోసి, రహస్య మార్గమున రాజు పడకగదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమియు ఎరుగని దానివలె అందరితో కలిసి తిరుగుచుండెను.

రామాయణం -- 18

జనక మహారాజుగారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా రాజసభకి చేరుకున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో ఇలా అంటాడు.......వీళ్ళ ఇద్దరికీ నీ దెగ్గరున్న శివ ధనుస్సుని చూపిద్దామని తీసుకొచ్చాను, నువ్వు ఒకసారి ఆ శివ ధనుస్సుని చూపిస్తే వీళ్ళు చూసి సంతోషించి తిరుగు ప్రయాణం చేస్తారు అని అన్నాడు. అప్పుడు జనకుడు తనకి ఈ శివ ధనుస్సు ఎలా వచ్చిందో చెప్పడం ప్రారంభించాడు.
పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగం ప్రారంభించాడు. శివుడులేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షుని కుమార్తె అయిన సతీదేవి(పార్వతీదేవి) యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది. ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు. అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్ళారని ఆయన ధనుస్సు పట్టుకున్నాడు, వెంటనే దేవతలు ప్రార్ధించగా ఆయన శాంతించాడు.
ఆ ధనుస్సుని జనక మహారాజు వంశంలొ పుట్టిన దేవరాతుడు అనే రాజు దెగ్గర న్యాసంగా( అంటె కొంతకాలం ఉంచారు) ఉంచారు. అప్పుడా దేవరాతుడు ఆ ధనుస్సుని ఒక మంజూషలొ(పెద్ద పెట్టె) పెట్టాడు. చక్రాలున్న ఆ మంజూషలొ శివ ధనుస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5000 మంది కావాలి. అలా ఆ విదేహవంశీయులు ఆ శివ ధనుస్సుని రోజూ పూజిస్తూ, పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు.
అథ మే కృషతః క్షేత్రం లాంగలాత్ ఉత్థితా మమ |
క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతా ఇతి విశ్రుతా ||
అలాగే నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. అలా దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక బాలిక తనంత తానుగా పైకి లేచింది. నాగటి చాలుకి తగిలి పైకి వచ్చింది కనుక, అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెని సీతా అని పిలిచాము(జనకుని కూతురు కనుక జానకి, మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి, దేహం మీద భ్రాంతిలేని విదేహ వంశంలో పుట్టింది కనుక వైదేహిఅని సీతమ్మకి పేర్లు). ఆమె అయోనిజ, ఒక స్త్రీ కడుపులో గర్భవాసం చేసి పైకి వచ్చినది కాదు. ఆమె అద్భుతమైన సౌందర్యరాశి. ఆమెని చూసిన దేవతలు, రాక్షసులు, యక్షులు మొదలైన వాళ్ళందరూ ఆమెని తమ భార్య చేసుకుందామన్న వ్యామోహం పొందారు. అందుకని నేను ఆమెని వీర్య శుల్కగా( అంటె పరాక్రమము చేత గెలుచుకోబడవలసినది) ప్రకటించి, శివ ధనుస్సుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తాను అన్నాను. అలా ఎందరో రాజులు వచ్చారు శివ ధనుస్సుని ఎక్కుపెట్టడానికి, కొంతమంది ఆ ధనుస్సుని చూడగానే పడిపోయారు, ఎవరూ కనీసం దాన్ని కదపలేకపోయారు. వచ్చిన వాళ్ళందరూ భగ్నహృదయాలతో వెనుదిరిగేవాళ్ళు.
ఈ జనకుడు పెట్టిన పరీక్షలో ఎవరమూ గెలవలేము, ఆ ధనుస్సుని ఎవరమూ ఎక్కుపెట్టలేము, కనుక మనందరమూ ఒకటై, జనకుడి మీదకి యుద్ధానికి వెళదాము అని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి మా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు మా రాజ్యం చుట్టూ ఒక పెద్ద అగడ్త(భుమిని తవ్వి దానిని నీళ్ళతో నింపుతారు) తవ్వి, ద్వారాలు మూసేశాము. ఒక సంవత్సరం పాటు యుద్ధం జరిగాక మా దెగ్గరున్న ఆహార నిల్వలు క్షీణించిపోయాయి. అప్పుడు నేను తపస్సు చేశాను. నా తపస్సుకి మెచ్చిన దేవతలు తమ సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ దేవతా సైన్యంతో నేను ఆ రాజులని ఓడించాను అని జనకుడు చెప్పుకున్నాడు.
అప్పుడు జనకుడు " ఒకవేళ ఈ రాముడు శివ ధనుస్సుని ఎక్కుపెట్టగలిగితే, నేను నా కూతురు సీతని కన్యాదానం చేసి ఇస్తాను" అన్నాడు.

రామాయణం ఉత్తమమైన చారిత్రిక గ్రంథం

రామాయణం ఉత్తమమైన చారిత్రిక గ్రంథం. ఎవరికో తోచక వ్రాసిన కథనో లేక నవలనో కాదు. చతుర్ముఖ బ్రహ్మ యుద్దానంతరం జరిగిన సన్నివేశాలని జరిగినవి జరిగినట్లు తెలిసేలా వాల్మీకికి వరం ఇచ్చాడు. ఆదృష్టాన్ని వాడి వాల్మీకి "హసితం భాషితం చైవ గతిర్యాయశ్చ చేష్టితం" ఎవరు నవ్వినా, ఏమి మాట్లాడినా, కదలినా, ఏది అనుకున్నా, ప్రతి స్పందనని ఉన్నది ఉన్నట్టు చూసి జరిగినదాన్ని జరిగినట్లు వ్రాసాడు. అట్లా ఎలా సాధ్యం అని అనిపిస్తుంది, అంటే ఈ నాడు ఏదో చేయ్యి చూసి లేక పుట్టిన సమయం బట్టి జరిగిన విషయాలు చెప్పగలిగేవారు కూడా ఉన్నారు అంటే ఆశ్చర్యం అవసరం లేదు. ఇలాంటి విషయాలని గుర్తించేప్పుడు మనకు తోచినట్లు కొన్నింటిని మనం మనకు ఊహిస్తుంటాం, పొరపాటు అక్కడే వస్తుంది.
ఒకసారి ఇంగ్లీషు దొరవారు ఒక గ్రామాన్ని పరిశీలన చేయడానికి వచ్చాడు, ఒక చాకలివాడు బట్టలు ఉతుకుతున్నాడు. ప్రక్కనే బట్టలని ఉడికిస్తూ, ఒక్కోటి తీసి బండకేసి కొడుతూ ఉతుకుతున్నాడు. ఇంగ్లీషు దొరవారు కొంతసేపు గమనించి ఒక నిర్ణయానికి వచ్చాడు, అసలు ఈ దేశం వారికి బుద్ది లేదు ఒక బండను పగలగొట్టాలంటే బట్టలతో కొడుతున్నారు, అట్లా పగలక పోతే ఆ బట్టను వేడి చెసి మరీ ప్రయత్నిస్తున్నారు అని తనకు తోచిన అవగాహనకి వచ్చేసాడు. అట్లానే సింధూలోయ నాగరికథని గూర్చి అట్లానే నిర్ణయించి చెప్పారు. సింధూ నది చుట్టు ప్రక్కన చిన్న చిన్న గొడలు కట్టి ఉంటాయి, వాటిని వారు వర్షపు నీరుని ఎక్కడికక్కడ నిలువ చేయడానికి కట్టినవి. కానీ వారు అవి ఆత్మ రక్షణకి ఏర్పాటు చేసుకున్న బంకర్లు అని తేల్చి చెప్పారు. పాశ్చాత్యులకి ఎప్పుడూ అవే ఆలోచనలు, ఎప్పుడు ఒకరిపై దాడిచేద్దామా అని. మన భారతీయమైన సంప్రదాయం అట్లా ఉండదు, అవసరమైతే ఒకరి సుఖం కోసం మన జీవితాన్ని ఇచ్చేసే మానవ మనస్తత్వం. రాక్షస ప్రవృత్తి కాదు. మన దేశంపై దాడి చేసి పాలించిన మొఘలాయీల విషయం తెలుసుకుంటే అర్థం అవుతుంది. రాజ్యం కొరకు తన సోదరుడిని చంపించడానికి వెనకాడలేదు ఔరంగజేబు.
శ్రీరామాయణం మానవత్వం అంటే ఎట్లా ఉండాలో అడుగడుగున నిరూపిస్తుంది. ఎవరెవరు ఏమేమి చేసారో అన్నీ పనులలో మానవత్వం పరిమళిస్తుంది. ఈ జాతికి ఎప్పుడూ ఆక్రమణలు కాదు, ఆనందం పంచడం కావాలి. ఒకరిది దోచుకోవడం కాదు, ఒకరికి ఆనందం ఎట్లా పంచాలో కావాలి. అయోధ్యకాండలో తండ్రి రామచంద్రునికి రాజ్యం ఇవ్వాలని అనుకున్నాడు కానీ తల్లి భరతునికి ఇవ్వాలని కోరింది. ఈ విషయం కైకమ్మ రామచంద్రునితో చెబుతుంటే, తండ్రిగారు అంత సంకోచించాల్సింది ఏముంది, ఇది చెప్పడానికి ఇందులో అంత సందేహించాల్సిన అవసరం ఏముంది కనక, రామా అడవికి వెళ్ళు అని ఒక్క మాట చెబితే చాలు, "రాజ్యంవా వనవాసోవా వనవాసో మహోదయః" నాకు రాజ్యమైతేనేమి వనవాసమైతేనేమి రెండూ తండ్రి గారివే అని సంతోషంతో వనానికి వెళ్తా అని రాముడు చెప్పాడు.
చిత్రకూటంలో ఉన్నప్పుడు భరతుడు తన వెంట లక్షల మంది సైన్యంతో రాముడిని వెతుకుతూ వస్తున్నాడు. అంత మంది వచ్చేసరికి అడవిలో జంతువులు, పక్షులు చెల్ల చెదురు అవుతున్నాయి. అది గమనించి ఎవరైనా వేటకు వచ్చారా లేక ఏదైన యాత్ర జరుగుతుందా అని రాముడు లక్ష్మణ స్వామిని చెట్టు ఎక్కి చూడమన్నాడు. లక్ష్మణుడు చెట్టు ఎక్కి ద్వజాన్ని చూసి ఇంకేముంది వనవాసం అయ్యాక తిరిగి రాజ్యం ఇవ్వడం ఇష్టంలేక మన పై దాడికి వచ్చాడు భరతుడు, ధనస్సును సిద్దం చేసుకో, సీతమ్మను దాచి పెట్టు అంటూ కేకలు వేసాడు. రాముడు లక్ష్మణుడితో భయం ఎందుకు అని అన్నాడు. ఒక దానిపై అత్యాశ పెంచుకున్నప్పుడు, దాన్ని దూరం చేస్తారేమోనని భయం వేస్తుంది కానీ అసలు ఆశ లేనప్పుడు భయం ఎక్కడ ఉంటుంది. భరతుని గురించి నాకు తెలుసు, ఒక వేల భరతునికి రాజ్యం కావాలనే ఆశ ఉంది అని నీవు అనుకుంటే ఒక పని చేస్తా, భరతుడు వచ్చాక నాతో పాటు వసవాసానికి భరతుడిని రమ్మంటా, నీవు వెళ్ళి రాజ్యాన్ని పాలించు అని చెప్పాడు. వెంటనే తల దించుకొని నోరు ఎత్తలేదు లక్ష్మణుడు. అయితే లక్ష్మణుడికి రాజ్యంపై ఆశ కాదు, రాముడిపై ప్రేమాతిశయం. మనం చుట్టూ ఉన్న వారితో ఎట్లా ప్రవర్తించాలో తెలుపుతుంది రామాయణం, అందుకే దాన్ని ఇతిహాస శ్రేష్టం అని అంటారు.

మాఘపురాణం - 26వ అధ్యాయము సుధర్ముడు తండ్రిని చేరుట

పాపమా బాలుని జాతకము ఎటువంటిదో గాని తన తల్లి అడవిలో పులిచే చంపబడింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయినది. ఇక ఆ పిల్లవానిని దీన రక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడ్చీ ఏడ్చీ అలసి నిద్రపోయాడు. అక్కడొక తులసిమొక్క వున్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసిచెట్టు పై బడినందున ఆ రాత్రి అతనికే అపాయమూ కలుగలేదు. పైగా దైవభక్తి కలిగెను. ఉదయమే లేచునప్పటికి అడవిలో ఏకాంతముగా నున్నందున భయపడి బిగ్గరగా ఏడ్చినాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదనచేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఇచ్చుచుండెడివి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభి వృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి వుండెనో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచు కాలము గడుపుచుండెను.
అలా పెరుగుతూ పన్నెండేండ్లు ప్రాయం గల వాడయ్యెను. ప్రతి దినము తులసి పూజ భగవన్నామ స్మరణ చేస్తూ “నన్ను కాపాడుము తండ్రీ అనాధరక్షకా” అని ప్రార్థించుచు, ఒక్కొక్కప్పుడు విరక్తుడై “ఛీ ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా? నేను బ్రతికెందుకు?” అని దుఃఖించుచుండగా, ఆకాశవాణి “ ఓ బాలచంద్రా! నీవట్లు విచారింపకుము. ఈ సమీపముననే ఒక కోనేరు వున్నది. మాఘమాసం ప్రవేశించినది. అందుచే నీవా సరస్సులో స్నానం చేసినయెడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును” అని పలికిన మాటలు ఆకాశమునుండి వినిపించినవి. వెంటనే ఆరాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించెను.
ఈ బాలుని నిష్కళంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీ నారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి “బాలకా నీకేమి కావలయునో కోరుకొనుము” అని యనగా “ప్రభూ! నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనా పాలనా చేయువారెవరైననూ లేరు. పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరుగను. ఈ వనచరములే నన్ను రక్షించి పోషించుచున్నది. గాన మీ సన్నిధానమునకు నన్ను తీసుకొని పొండు. మరేమియు అక్కరలేదు” అని ప్రార్థించెను.
“ఓయీ రాజనందనా! నీవు ఇంకను భూలోకమునందు ధర్మంగా పరిపాలన చేయవలసిన యవసరమున్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీగురించి నీ కన్నతల్లిని గురించి బెంగతో ఉన్నాడు. గాన నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్ము” అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకొనుచున్న ఒక మునీశ్వరునితోడు యిచ్చి సులక్షణుని వద్దకు పంపెను.
అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భావిటిగా వుండి ఎటుపోయెనో, పుట్టిన బిడ్డ ఏమాయెనో అని తన రాజ్యమంతయు వెదకించి తానును వెదకి వారి జాడ తెలియనందున విచారమనస్కుడై రాచకార్యములు చూడకుండెను. అటువంటి సమయములో మునివెంట కుమారుడు వెళ్ళెను. రాజుతో ముని యా బాలుని జన్మవృత్తాంతం తెలియజేయుసరికి సులక్షణ మహారాజు అమితానందభరితుడై బాలుని కౌగలించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకము చేసెను.

మాఘపురాణం - 24వ అధ్యాయము


ఒక మాఘమాసంలో నొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. తన భార్య మాత్రం స్నానమాచరించనని చెప్పుటచే ఆమె దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపొయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గందర్వుడొక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూచెను. ఆమె అందము యౌవనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలతో తేలియాడుచుండగా మరలనా గంధర్వుడు భార్యను వెదకుకొనుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు, గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆదృశ్యమును చూచి మండిపడుచు “నీవు తపస్వివైయుండి కూడా కామతృష్ణ గల వాడవైతివి గాన నీకు కోతి ముఖము సంభవించుగాక యని విశ్వామిత్రుణ్ణి, “ఓసీ కులటా! నీవు పాషాణమై పడివుండు”మణి భార్యను శపించి వెళ్ళిపొయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖము కలిగివుండగా నారదుడు ఈవిషయం తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి “విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకు లోని నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు. సరేలెమ్ము. గంగా నదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము. అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లెను. ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వ లోకమునకు వెళ్ళిపోయెను. విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయినాడు.

రామాయణం -- 17

ఉత్తర దిక్కున కౌశికి నది పక్కన కూర్చుని ఘోరాతిఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాక దేవతలతో కలిసి బ్రహ్మగారు ప్రత్యక్షమై, నేను నీ తపస్సుకి చాలా ఆనందించాను, ఇక నుంచి అందరూ నిన్ను మహర్షి అని పిలుస్తారు అని అన్నారు. ఈ మాట విన్న విశ్వామిత్రుడికి బాధ కాని సంతోషం కాని కలగలేదు. ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పటికి మహర్షిని అయ్యాను, ఇక బ్రహ్మర్షిని ఎప్పుడు అవుతానో అనుకొని బ్రహ్మగారిని, నేను నా ఇంద్రియాలనిగెలిచాన అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇప్పటికైతే నువ్వు ఇంకా నీ ఇంద్రియాలని గెలవలేదు, ఇంద్రియాలని గెలవడం అంత తేలిక కాదు అన్నాడు.
మెల్లగా విశ్వామిత్రుడి పగ వశిష్ఠుడి మీద నుంచి తన ఇంద్రియాల మీదకి వెళ్ళింది. తను అనవసరంగా వశిష్ఠుడి మీద క్రోధాన్ని పెంచోకోవడానికి, మేనకతో కామానికి లొంగడానికి తన ఇంద్రియాలే కారణమని గ్రహించాడు.
మళ్ళి ఘోరమైన తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. ఈ సారి ఎండాకాలంలో తన చుట్టూ నాలుగు పక్కల అగ్నిని పెట్టుకొని, తల పైకెత్తి సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి తపస్సు చేశాడు. వానాకాలంలో నడుముదాకా నీళ్ళల్లో ఉండి తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు చేస్తున్న ఈ తపస్సుని చూసిన దేవేంద్రుడు ఆయనని పరీక్షించాలని రంభని పంపాడు. రంభ భయపడి వెళ్ళనంటే నానారకాలుగా నచ్చ చెప్పి పంపించాడు. మరుసటి రోజు విశ్వామిత్రుడు స్నానం చేద్దామని వెళుతుంటే ఆయనకి అప్పుడే స్నానం చేసి బయటకొస్తున్న రంభ కనిపించింది, చెట్లన్నీ వసంత ఋతువులో ఎలా పూలతో ఉంటాయో అలా పూలతో కళకళలాడుతున్నాయి, కోకిల పాట కూడా వినిపించింది. విశ్వామిత్రుడికి అనుమానం వచ్చింది, ఇది వసంత ఋతువు కాకపోయినప్పటికీ చెట్లన్నీ పూలతో ఉన్నాయి, కోకిల పాట పాడుతోంది. అయితే ఇదంతా ఇంద్రుడు నా తపోభగ్నానికి చేస్తున్న ప్రయత్నం అని గ్రహించి కోపంతో ఇలా అన్నాడు.....
యత్ మాం లోభయసే రంభే కామ క్రోధ జయ ఏషిణం |
దశ వర్ష సహస్రాణి శైలీ స్థాస్యసి దుర్భగే ||
నన్ను ప్రలోభపెడదామని వచ్చిన ఓ రంభా! నువ్వు పదివేల సంవత్సరాలు రాయివై పడుండు అని శపించాడు.
తరవాత కొంతసేపటికి శాంతించి, అసలు రంభ చేసిన తప్పేముంది, నేను మళ్ళి క్రోధానికి లోనయ్యాను, ఇంద్రుడు పంపిస్తే ఆమె వచ్చింది అనుకొని రంభ అడగకుండానే ఒకనాడు ఒక బ్రాహ్మణుడు నీకు శాపవిమోచనం కలిగిస్తాడు అని అన్నాడు.
విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించాడు, నా శత్రువులు ఎక్కడో లేరు, నాలోనే ఉన్నారు. ఈ కోపము, కామము నాకు కలగడానికి నా మనస్సు కారణం, ఆ మనస్సు నా ఊపిరి మీద ఆధారపడిఉంది. అందుకని ఊపిరిని తీసి బయటకి వదలను, కుంభకం(యోగాలో ఒక ప్రక్రియ) చేస్తాను, అలాగే ఈ శరీరానికి అప్పుడప్పుడు కోరికలు కలగడానికి కారణం నా శరీరానికి కొంచెం ధృడత్వం ఉండడంవలన, కనుక కుంభకం చేస్తే నా శరీరం ఒక పుల్లలా అవుతుంది అని తూర్పు దిక్కుకి వెళ్ళి బ్రహ్మాండమైన తపస్సు మొదలుపెట్టాడు. అలా వెయ్యి సంవత్సరాలు కుంభకంలో ఉండి తపస్సు చేసేసరికి ఆయన శరీరం ఒక పుల్లంత సన్నగా అయ్యింది. తన శరీరాన్ని నిలబెట్టుకోడానికి కొంత కబళాన్ని తిందామని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలొ వచ్చి, అయ్యా! నాకు బాగా ఆకలిగా ఉంది, మీదెగ్గరున్నది నాకు కొంచెం పెడతారా అన్నాడు. వచ్చిన వాడు ఇంద్రుడని విశ్వామిత్రుడికి అర్ధమయ్యింది, కాని ఈ సారి ఆయన ఇంద్రియాలకి లొంగలేదు, ఇంద్రుడు తింటే ఏంటి నేను తింటే ఏంటి అనుకొని ఇంద్రుడికి ఆ కబళాన్ని ఇచ్చి మళ్ళి కుంభకంలోకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.
అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఆయన బ్రహ్మస్థానం నుంచి ఆయన తపఃశక్తి పొగగా బయలుదేరింది. ఆయన తపోధూమం సమస్త లోకాలని కప్పేసింది, సముద్రాలు కదలడం ఆగిపోయాయి, సమస్త ప్రాణులు క్షోభించాయి. ఇక ఈ స్థితిలో విశ్వామిత్రుడిని ఎవరూ కదపలేరు, ఆయనకి శత్రువు లేడు మిత్రుడు లేడు, ఆయనకి అంతటా ఆ పరబ్రహ్మమే కనిపిస్తుంది. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి.........
బ్రహ్మర్షే స్వాగతం తే అస్తు తపసా స్మ సు తోషితాః |
బ్రాహ్మణ్యం తపసా ఉగ్రేణ ప్రాప్తవాన్ అసి కౌశిక ||
ఓ కౌశికా! నీ తపస్సుకి సంతోషించాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతలందరితో కలిసి నేను నిన్నుబ్రహ్మర్షి అని పిలుస్తున్నాను, నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయిష్మంతుడవై జీవిస్తావు అన్నారు.
అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితొ.......నేను బ్రహ్మర్షిని అయిన మాట నిజమైతే నాకు ఓంకారము,వషట్కారము వాటంతట అవి భాసించాలి అన్నాడు( ఓంకారము, వషట్కారము భాసిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత పొందుతాడు, అలాగే తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత పొందుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు పుట్టుక చేత క్షత్రియుడు కనుక). అలాగే, ఎవరిమీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశానో, ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు. బ్రహ్మగారు సరే అన్నారు.
అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా, ఆయన విశ్వామిత్రుడిని చూసి బ్రహ్మర్షి విశ్వామిత్రా అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి కాళ్ళు కడిగి పూజ చేశాడు.
ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో, ఆ వశిష్ఠుడి కాళ్ళు కడగడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అని శతానందుడు రాముడితో చెప్పాడు.
బ్రహ్మర్షి అవ్వడానికి, కామక్రోధాలని జయించడానికి మీ గురువు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఇలాంటి గురువుని పొందిన రామ నువ్వు అదృష్టవంతుడివి అన్నారు. విశ్వామిత్రుడి కథ విన్న రాముడు పొంగిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా విశ్వామిత్రుడికి ప్రణిపాతం చేశారు.
రేపు సూర్యోదయం అయ్యాక ఒకసారి నాకు దర్శనం ఇవ్వండని జనక మహారాజు విశ్వామిత్రుడితో చెప్పి వెళ్ళిపోయాడు.