MAAGHA PURANAM -- 2

మాఘ పురాణం – 2వ అధ్యాయం
దిలీప మహారాజు వేటకు బయలుదేరుట:
దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రివలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలెననెడి కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైననూ నెరవేర్చుకొనుట సహజమే కదా! ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్యసమేతుడై వెడలెను.
దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి కౄరమృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను, మనుష్యులను చంపి నానా భీభత్సములు చేయుచున్నవి.
దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకూ అడవియందు వుండి అనేక క్రూర జంతువులను జంపిరి. ఒకనాడొక మృగం పై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడువక దాని వెంట పరుగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు, ఆతని వెనుక పరివారము పరుగిడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎందిపోతున్నది. నీటికొరకు పరివారమంతా వెదుకుచుండిరి. అదృష్టం కొలదీ ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామరపువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడూ అతని పరివారమూ, తృప్తిదీర నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వట వృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు, అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి, బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను.
అటుల ఇంటిముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు గలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడియుండెను. ఆ బ్రాహ్మణుడును క్షణమాగి, ఆ రాజును గాంచి “ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతునివలె నున్నాడు. ఈతని కేదయినా ఉపకారము చేయుట మంచిది” అని మనసులో తలచి – మహారాజా! శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్ననూ అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా!” అని ప్రశ్నించెను.
ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని జూచి – “విప్రోత్తమా! అటుల ప్రశ్నించారేమిటి?” అని ఆశ్చర్యంతో పలికెను.
“పరమ పావనమైన మాఘమాసం కదా!” అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను.
“చిత్తము స్వామీ! నాకు గుర్తులేదు. రాజప్రసాదమున నున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయావినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకా విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహాత్మ్యము నెరింగింప వలసినదిగా ప్రార్థించుచున్నా”నని దిలీపుడు వేడుకొనెను.
ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి “రాజా! సూర్యవంశపు గురువైన వశిష్ఠులవారు అప్పుడప్పుడు మీకడకు వచ్చుచుండును గదా! ఆతని వలన మాఘమాస మహాత్మ్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియు లేదు. గాన అటుల చేయుము” అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను.
దిలీపుడు వశిష్ఠుని కడకుబోవుట:
దిలీపుడు తన పరివారంతో నగరము జేరెను. పదేపదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులనో ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతఃకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు, సకలాభరణములు ధరించి, మంత్రి, సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను.
ఆ సమయములో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును జూచి వారికి తపోభంగము కలుగనీయరాదనీ కొంతతడవు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సునుండి లేచి రాజును కుశల ప్రశ్నలడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని యడిగెను.
దిలీపుడు వశిష్ఠునితో “ఋషిసత్తమా! తమవలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహాత్మ్యముగాని,దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమనుండి తెలుసుకొన గోరి తమ వద్దకు వచ్చితిని. గాన పరమ పావనమూ మంగళప్రదమూ అయిన మాఘమాస మహాత్మ్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను” అనెను.
అవును మహారాజా. నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన యావశ్యకత ఎంతయినా గలదు.
మాఘమాసముయొక్క మహాత్మ్యమును వర్ణింప నాకుకూడా శక్యముగాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని, యాగములు గాని, ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయునదీస్నానమువలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలము నిచ్చు మాఘమాసము అన్నివిధముల శుభప్రదమైనది. గాన యీ మాఘమాసమునందు చేయు నదీ స్నానమువలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతియేగాదు. మాఘము అన్నివిధాలా పుణ్యప్రదమైనది.
అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘ మాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్న మహత్తుగలది మరొకటి లేదు.

No comments:

Post a Comment